టెక్ స్టార్టప్స్ కు ఫేస్‌‌బుక్ ఆసరా

తిరువనంతపురం : ఇండియాలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌‌‌కు గణనీయమైన ఆదరణ లభిస్తోంది. స్టార్టప్‌‌‌‌ల జోరు నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడి టెక్నాలజీ స్టార్టప్స్‌‌‌‌లో పెట్టుబడులను పెట్టనున్నట్టు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌‌‌‌బుక్ తాజాగా ప్రకటించింది. ఇక ఇప్పుడు తాము ఇండియన్ టెక్నాలజీ స్టార్టప్స్‌‌‌‌లో ప్రత్యక్షంగా పెట్టుబడులు పెడతామని ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ఇండియా వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ చెప్పారు. ‘ఇక మా సమయాన్ని వెచ్చించేందుకు సన్నద్ధంగా ఉన్నాం. దేశంలో ఉన్న ఇంజనీరింగ్‌‌‌‌ టాలెంట్‌‌‌‌ను వాడుకునే సామర్ధ్యం మాకుంది’ అని ప్రకటించారు. హడిల్ కేరళ 2019 రెండో ఎడిషన్‌‌‌‌ ఓపెనింగ్ సెషన్‌‌‌‌లో ఆయన మాట్లాడారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌‌‌‌ కోసం జరుగుతున్న ఆసియాలోని అతిపెద్ద ఈవెంట్‌‌‌‌లలో ఇదీ  ఒకటి. రెండు రోజుల ఈవెంట్ ఇది. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి కేరళ స్టార్టప్‌‌‌‌ మిషన్ ఈ ఈవెంట్‌‌‌‌ను నిర్వహిస్తోంది.

మీషోతో ఎన్నో..

‘మీషో ద్వారా ఫేస్‌‌‌‌బుక్ ప్రపంచంలో ఏదైనా చేయగలదని నిరూపిస్తూ.. గత కొన్ని నెలల క్రితం తొలిసారి మైనార్టీ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ను ప్రకటించాం. మీషో ద్వారా మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాం. స్నేహితులకు, ఫ్యామిలీలకు ప్రొడక్ట్‌‌‌‌లను అందజేసేలా మీషో సహకరిస్తుంది’ అని మోహన్ చెప్పారు. వాట్సాప్,ఫేస్‌‌‌‌బుక్, ఇన్‌‌‌‌స్టాగ్రామ్ వంటి సోషల్ ఛానళ్ల ద్వారా మహిళా వ్యాపారవేత్తలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ స్టోర్లను ఏర్పాటు చేసుకునేందుకు మీషో ఉపయోగపడుతోంది. మూడేళ్ల క్రితం మీషో  ఏర్పాటైంది. ఈ మోడల్ ద్వారా తొలిసారి రెండు లక్షల మంది మహిళా వ్యాపారవేత్తలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌కి తీసుకొచ్చినట్టు మోహన్ పేర్కొన్నారు. ఇండియా నుంచి వచ్చిన నూతనావిష్కరణ ఇదని, దీన్ని ప్రపంచానికి పరిచయం చేసినట్టు పేర్కొన్నారు. ఉద్యోగాల కల్పనలో కూడా ఈ మోడల్‌‌‌‌ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ఎకానమీలో ఏ విశ్లేషణను చూసుకున్నా.. చిన్న వ్యాపారాల నుంచే ఎక్కువగా ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

టెక్నాలజీ రంగంలో మహిళలు 30–35 శాతం

ప్రభుత్వ డేటాను ఉదహరించిన మోహన్, టెక్నాలజీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం 30 శాతం నుంచి 35 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు. లింగ బేధాన్ని బ్రేక్ చేసేందుకే తాము ఎక్కువగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. మహిళలు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోకి వచ్చేందుకు ఉన్న పరిమితులేమిటి? అనే దానిపై ఆలోచించాల్సినవసరం ఉందన్నారు. నైపుణ్యాలు పెంచేందుకు కంపెనీలు ఫోకస్ చేయాలని, స్టార్టప్‌‌‌‌లకు ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లను ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రతి రెండు గంటలకు ఒక స్టార్టప్ రిజిస్టర్…

స్టార్టప్ ఎకోసిస్టమ్‌‌‌‌ను అభివృద్ధి చేయడం కోసం కేరళ అవలంబిస్తున్న మోడల్‌‌‌‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో అవ్వాలని డిపార్ట్‌‌‌‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ అనిల్ అగర్వాల్ సూచించారు. దేశంలో ప్రతి రెండు గంటలకు ఒక స్టార్టప్ రిజిస్టర్ అవుతుందని చెప్పారు. సెప్టెంబర్ వరకున్న రికార్డుల ప్రకారం దేశంలో 22,895 స్టార్టప్‌‌‌‌లున్నాయని తెలిపారు. సుమారు 45 శాతం స్టార్టప్‌‌‌‌లు టైర్ 2, టైర్ 3 నగరాల నుంచేనని పేర్కొన్నారు. 9 శాతం నుంచి 10 శాతం స్టార్టప్‌‌‌‌లకు మహిళలే వ్యవస్థాపకులుగా ఉన్నారని వివరించారు. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించాల్సినవరం ఉందన్నారు.

Latest Updates