ల‌ఢ‌ఖ్‌లో మోడీ ప‌ర్య‌ట‌న‌.. ఉద్రిక్త‌త‌లు పెంచే చ‌ర్య‌లు వ‌ద్దంటూ చైనా స్టేట్మెంట్

ల‌ఢ‌ఖ్‌లో ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో చైనా స్పందించింది. ఆయ‌న స‌రిహ‌ద్దుల్లోని మ‌న జ‌వాన్ల‌తో స‌మావేశ‌మైన వారిలో నైతిక స్థైర్యం పెంచేలా ప్ర‌య‌త్నించిన కొద్ది గంట‌ల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి లిజియాంగ్ మాట్లాడారు. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల‌ను పెంచే ఎటువంటి చ‌ర్య‌ల‌కూ ఇరు దేశాల్లో ఏ ఒక్క‌రూ పూనుకోవ‌ద్ద‌ని అన్నారు. భార‌త్, చైనా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బరిచేందుకు మిల‌ట‌రీ, దౌత్య ప‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. ఇటువంటి స‌మ‌యంలో ప‌రిస్థితులు వేడెక్క‌కుండా చూసుకోవాల‌న్నారు లిజియాన్.

దురాక్ర‌మ‌ణ కాంక్ష‌తో స‌రిహ‌ద్దుల్లో దాదాపు రెండు నెల‌ల నుంచి చైనా ఉద్రిక్త‌త‌ల‌ను రాజేస్తోంది. జూన్ 15న గాల్వ‌న్ లోయ వ‌ద్ద భార‌త్ వైపు చొచ్చుకొచ్చే ప్ర‌య‌త్నం చేసింది. చైనా ఆర్మీ దుందుడుకుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో భార‌త సైనికులు నిలువ‌రించారు. ఈ స‌మ‌యంలో ప‌ర‌స్ప‌రం ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. చైనా సైనికులు ఇనుప‌రాడ్లు, క‌ర్ర‌లు, రాళ్ల‌తో దాడికి దిగారు. వాళ్ల దాడిని అంతే దీటుగా తిప్పి కొట్టారు భార‌త జ‌వాన్లు. తీవ్రంగా జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌ల్లో 20 మంది భార‌త జ‌వాన్లు అమ‌రుల‌య్యారు. చైనాకు చెందిన 40 మందికి పైగా మ‌రణించారు.

ఈ నేప‌థ్యంలో స‌రిహ‌ద్దుల్లో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు మిట‌ల‌రీ క‌మాండ‌ర్ స్థాయిలో, విదేశాంగ శాఖ ప్ర‌తినిధుల స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. పైకి శాంతి కోరుకుంటున్నామ‌ని చెబుతున్న చైనా.. స‌రిహ‌ద్దుల్లో నుంచి బ‌ల‌గాల‌ను వెన‌క్కి పంపేందుకు మాత్రం సిద్ధ‌ప‌డ‌డం లేదు.

యుద్ధ మేఘాలు క‌మ్ముకున్న ఈ నేప‌థ్యంలో స‌రిహ‌ద్దుల్లో ప‌రిస్థితుల‌ను తెలుసుకుని, భార‌త సైనికుల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ఇవాళ ప్ర‌ధాని మోడీ.. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్, ఆర్మీ చీఫ్ జ‌న‌రల్ మ‌నోజ్ ముకుంద్‌ల‌తో క‌లిసి ల‌ఢ‌ఖ్‌లోని ఆర్మీ పోస్టుల‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా 11 వేల అడుగుల ఎత్తులో ఉన్న నిమూ పోస్ట్‌లో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ జవాన్ల‌తో మాట్లాడారు. స‌రిహ‌ద్దుల్లోని ప‌రిస్థితుల‌పై వివ‌రాల‌ను తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ విస్త‌ర‌ణ కాంక్ష‌తో ఉన్న వాళ్లు ప‌రాజితులైన‌ట్లు చ‌రిత్ర చెబుతోంద‌ని అన్నారు. బ‌ల‌వంతుడు మాత్ర‌మే శాంతి కావాల‌ని కోర‌గ‌ల‌డ‌ని, బ‌ల‌హీనుల‌కు ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేర‌ని చెప్పారు. వీర జ‌వాన్లు త‌మ ధైర్య సాహ‌సాల‌తో భార‌త్ బలాన్ని ప్ర‌పంచానికి చాటార‌ని అన్నారు. ప్రపంచం యుద్ధం కోరుకున్నా, శాంతిని కావాలనుకున్నా.. అలాంటి పరిస్థితులు ఏర్పడిన ప్రతిసారి ప్రపంచం మన ధైర్య సాహసాలను, గెలుపును చూసింద‌న్నారు.

Latest Updates