ఆసుపత్రిలో పవర్ కట్.. ఐదుగురు మృతి

After power failure, 5 patients on ventilator die at Madurai hospital

తమిళనాడులోని మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో కరెంటు లేక.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు చనిపోయారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

మరణించిన వారి బంధువుల కథనం ప్రకారం.. మధురైలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి చెట్లు, స్తంభాలు కూలిపోవడంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో మధురైలోని ప్రభుత్వాస్పత్రిలోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ఎమర్జెన్సీ వార్డులో పనిచేసే అన్ని విద్యుత్ పరికరాలు రెండున్నర గంటలపాటు ఆగిపోయాయి. ఫలితంగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఐదుగురు రోగులు మృతి చెందారు.

మృతి చెందిన వారిలో పల్లినిమల్ (60), మల్లికా (55), రవీంద్రన్ (52) ఉన్నారు. మరో ఇద్దరి గురించి తెలియాల్సి ఉంది.  ఈ సంఘటనతో మరణించిన వారి బంధువులు దాదాపు 100 మంది ఆసుపత్రి ముందు నిరసనకు దిగారు.

ఆసుపత్రి డీన్ వనితా మణి మాత్రం రోగులవి సహజ మరణాలేనని, వారి చావుకు కారణం వెంటిలేటర్ వైఫల్యం కాదని మృతుల బంధువుల ఆరోపణలను తిప్పి కొట్టారు. ఈ ఘటన మధురై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Latest Updates