యాక్సిడెంట్‌లో బిడ్డ చావు: బెంగతో కుటుంబంలో ఒక్కొక్కరుగా మృతి

పద్నాలుగు నెలల క్రితం కొడుకు మృతి..

బెంగతో మంచంపట్టి ప్రాణం విడిచిన తల్లి

తమ్ముడి పుట్టిన రోజున ఉరేసుకున్న అక్క

కుటుంబంలో ఒంటరిగా మిగిలిన తండ్రి

ఒక్క రోడ్డు ప్రమాదం.. ఆ కుటుంబాన్ని స్లో పాయిజన్‌లా ఒక్కొక్కరుగా పొట్టనబెట్టుకుంది. నవ మాసాలు కనిపెంచిన కొడుకు ప్రాణం పోవడాన్ని తట్టుకోలేకపోయిందా మాతృమూర్తి. ప్రయోజకుడై మంచి పేరు తెస్తాడనుకున్న కన్న బిడ్డ.. కళ్లముందే మట్టిలో కలిసిపోవడం చూసి కకావికమైంది తల్లి మనసు. బెంగతో మంచం పట్టింది. మూడు నెలలు తిరగకుండా ఆమె కన్నుమూసింది.

తోడబుట్టిన వాడు.. ప్రాణం పోసిన అమ్మ.. ఇద్దరూ తనను విడిచి వెళ్లిపోవడంతో తల్లడిల్లిందా యువతి. మనసులో నుంచి ఆ విషాదాన్ని చెరిపేయలేక మౌనంగా రోదిస్తూనే గడిపింది కొంత కాలం.. చివరికి ఇవాళ తన తమ్ముడి పుట్టిన రోజున తానిక ఈ భూమిపై బతకలేనని ఉరేసుకుని ప్రాణం తీసుకుంది.

విధి ఆడిన వింత నాటకంలో ఇప్పుడు ఆ ఇంట్లో తండ్రి ఒక్కడే ఒంటరిగా మిగిలాడు. ఈ విషాదం జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లిలో జరిగింది. సుందరిగిరి మేఘన(22) అనే యువతి ఇవాళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 14 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తన తమ్ముడు మరణించాడు. కొడుకుపై బెంగతో 11 నెలల క్రితం తల్లి ప్రాణం వదిలింది. చనిపోయిన తమ్ముడి పుట్టిన రోజునే (నవంబరు 7) ఇవాళ అక్క మేఘన ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలోని వారంతా తనను వదిలి వెళ్లిపోవడంతో ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిన తండ్రి బాధ వర్ణనాతీం. స్థానికులు ఎవరూ ఆయన్ని ఓదార్చడం అలవికాలేదు. 14 నెలల వ్యవధిలో ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో గ్రామంలోని వారు కూడా కంటతడి పెట్టుకుంటున్నారు.

Latest Updates