టర్కీతో కటీఫ్!.. కశ్మీర్ పై వ్యాఖ్యలతో మోడీ గరం

  • ఆర్టికల్ 370 రద్దును తప్పుపట్టిన టర్కీ అధ్యక్షుడు
  • ఆ దేశ పర్యటన రద్దు చేసుకున్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కశ్మీర్ విషయంలో మోడీ ప్రభుత్వం గట్టిగా వ్యవహరిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు గురించి విదేశాల జోక్యం అవసరం లేదని, ఇది భారత్ అంతర్గత వ్యవహారం అని పలుమార్లు చెప్పింది. అయినా దీనిలో వేలుపెడితే ఆ దేశంతో సంబంధాలపై కూడా ఆలోచించేందుకు సిద్ధపడుతోంది.

తాజా ఇటువంటి కఠిన నిర్ణయమే తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచింది టర్కీ. ఆర్టికల్ 370 రద్దును భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందంటూ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ అన్నారు. గత నెలలో ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ భారత్ నిర్ణయాన్ని తప్పుపట్టారాయన.

టర్కీ తీరుపై అసంతృప్తిని తెలియజేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే ఖరారైన టర్కీ రాజధాని అంకారా పర్యటనను ప్రధాని మోడీ రద్దు చేసుకున్నారు.

మరోవైపు ఇటీవల సిరియాలో టర్కీ బలగాలను మోహరించి, దాడులకు దిగడాన్ని కూడా భారత్ ఖండించింది. సిరియా సార్వభౌమత్వాన్ని గౌరవించాలని టర్కీకి సూచించింది. ఆ దేశంలో దాడులను ఉపసంహరించుకోవాలని కోరింది. కానీ, ఈ విషయంలో టర్కీ మొండిగా ముందుకెళ్తోంది.

టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్

Latest Updates