కృష్ణా నదికి మళ్లీ వరద పోటు.. శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్ కు ఉరకలెత్తుతున్న4 లక్షల క్యూసెక్కుల భారీ వరద

హైదరాబాద్: కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తుతోంది. అల్పపీడన ప్రభావంతో వానలు దంచి కొడుతుండడంతో వాగులు.. వంకలు ఉప్పొంగి కృష్ణా నదిలో కలుస్తున్నాయి. దీంతో కృష్ణా నది క్రమంగా ఉగ్రరూపం దాల్చుతోంది. కొద్ది సేపటి క్రితం శ్రీశైలం డ్యాం వద్ద 10 గేట్లు ఎత్తివేశారు. ఒక్కో గేటు 15 అడుగుల మేర ఎత్తి విడుదల చేశారు. దీంతో శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ కు సుమారు 4 లక్షల క్యూసెక్కుల భారీ వరద ఉరకలెత్తుతోంది.

ఎగువ నుండి వస్తున్న వరదలకు తోడు..  స్థానికంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నది లో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ భారీగా పెరుగుతోంది. మహారాష్ట్ర, కర్నాటకలో సాధారణ వర్షాలు కొనసాగుతుండడంతో ఆల్మట్, నారాయణపూర్ ల నుండి వరద యావరేజీగా వస్తోంది. అయితే కర్నాటక సరిహద్దుల్లో కురిసిన వర్షాల కారణంగా గద్వాల సమీపంలోని ప్రియదర్శిని జూరాలకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే చుక్కనీరు నిల్వ చేయలేని పరిస్థితి ఉండడంతో జూరాలకు వస్తున్న వరదను వస్తున్నట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి అనుగుణంగా జూరాల ప్రాజెక్టుకున్న గేట్లన్నీ దాదాపు ఎత్తివేయాల్సిన స్థాయిలో వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం 25 గేట్ల ద్వారా  ఒక లక్షా 73 వేల క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 20 వేలకుపైగా క్యూసెక్కులు కలిపి మొత్తం లక్షా 93 వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం డ్యామ్ గేట్లన్నీ ఎత్తివేత

ఓ వైపు జూరాల.. మరో వైపు తుంగభద్ర డ్యాం ల నుండి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం డ్యాం వద్ద గేట్లన్నీ ఎత్తివేశారు. మొత్తం 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు జూరాల నుండి 1 లక్షా 93 వేల క్యూసెక్కులు… తుంగభద్ర నుండి 68 వేల క్యూసెక్కులు చొప్పున వరద పోటెత్తుతుండగా.. డ్యాం వద్ద 2 లక్షల 8 వేల క్యూసెక్కులు నమోదు అవుతోంది. దీంతో డ్యాం గేట్లన్నీ ఎత్తి విడుదల చేస్తుండడంతో దాదాపు 4 లక్షల క్యూసెకకుల భారీ వరద నాగార్జునసాగర్ కు ఉరకలెత్తుతోంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ కు ఒక లక్షా 71 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఇది గంట గంటకూ పెరుగుతోంది.  దీంతో.. నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద మరిన్ని గేట్లు ఎత్తే పరిస్థితి ఏర్పడింది.

Latest Updates