బకాయిల్ని టెలికాం కంపెనీలు కట్టక తప్పట్లే

న్యూఢిల్లీఏజీఆర్ బకాయిల చెల్లింపులో సుప్రీం కోర్టు కఠినంగా వ్యవహరించడంతో  టెల్కోలు దిగొచ్చాయి. ఎయిర్‌‌‌‌టెల్‌‌, వొడాఫోన్‌‌ ఐడియా, టాటా గ్రూప్‌‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలలో కొంత భాగాన్ని సోమవారం చెల్లించాయి. భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ రూ. 10,000 కోట్లను చెల్లించింది. మిగిలిన డబ్బును మార్చి 17 లోపు కడతామని తెలిపింది.  కంపెనీకి ఉన్న 22 సర్కిళ్లలో బకాయిలను లెక్కించేందుకు టైమ్‌‌ పడుతోందని ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది.  భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌, భారతీ హెక్సకామ్‌‌, టెలినార్‌‌‌‌ల తరఫున  మొత్తం రూ. 10,000 కోట్లను చెల్లించామని భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ తెలిపింది. అదేవిధంగా వొడాఫోన్‌‌ ఐడియా రూ. 2,500 కోట్లను డీఓటీకి కట్టేసింది. మరో రూ. 1,000 కోట్లను ఈ శుక్రవారం లోపు కడతామని పేర్కొంది. మొత్తం బకాయిలను కట్టేందుకు మరి కొంత టైమ్‌‌ ఇవ్వాలని వొడాఫోన్‌‌ ఐడియా సుప్రీం కోర్టుని కోరినప్పటికీ అంగీకరించలేదు.  అంతేకాకుండా కంపెనీ బ్యాంక్‌‌ గ్యారెంటీలను క్యాష్‌‌గా మార్చకుండా ఉండేందుకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలనే రిక్వెస్ట్‌‌నూ  కోర్టు తిరస్కరించింది.టాటా గ్రూప్‌‌ కూడా చెల్లించాల్సిన బకాయిలలో రూ. 2,190 కోట్లను సోమవారం చెల్లించింది.
జనవరి 23 లోపు ఏజీఆర్‌‌‌‌ బకాయిలను చెల్లించకపోవడంతో టెల్కోలు, డీఓటీపై సుప్రీం కోర్టు సీరియస్‌‌ అయిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం చివరి నోటిసులను  టెల్కోలకు పంపింది. వొడాఫోన్‌‌ ఐడియా రూ. 53,000 కోట్లు, ఎయిర్‌‌‌‌టెల్‌‌ రూ. 35,586  కోట్లను, టాటా టెలీసర్వీసెస్‌‌ రూ. 13,800 కోట్ల బకాయిలను చెల్లించాలి.బ్యాంకింగ్‌‌ సెక్టార్‌‌‌‌పై ఏజీఆర్ ప్రభావాన్ని  జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత్‌‌ దాస్‌‌  అన్నారు.

బకాయిలపై ట్యాక్స్‌‌ కట్టండి

ఏజీఆర్‌‌‌‌ బకాయిలతో పాటు వీటిపై జీఎస్‌‌టీని కూడా టెల్కోలు కట్టాల్సి ఉంది. దీనిపై ట్యాక్స్‌‌ అధికారులు సోమవారం టెల్కోలకు నోటీసులను పంపారు.  జీఎస్‌‌టీ రాకముందు 15 శాతం ట్యాక్స్‌‌ను, జీఎస్‌‌ టీ వచ్చిన తర్వాత(జులై 1, 2017) 18 శాతం జీఎస్‌‌టీని కట్టాలని ట్యాక్స్‌‌ అధికారులు డిమాండ్‌‌ చేస్తున్నారు. మూతపడిన టెలికాం కంపెనీలు, దివాలాను ఎదుర్కొంటున్న కంపెనీలకు కూడా అధికారులు నోటీసులు పంపించారు. ఏజీఆర్‌‌‌‌ బకాయిలపై జీఎస్‌‌టీని చెల్లించాలని ఆపరేటర్లకు నోటీసలందాయని సీఓఏఐ స్పష్టం చేసింది.

బకాయిలు చెల్లిస్తే మన ఖజానాకు మంచిది

టెల్కోలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 1.47 లక్షల కోట్ల బకాయిలను చెల్లిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను దేశ ద్రవ్యలోటు 3.5 శాతానికి తగ్గుతుందని ఎస్‌‌బీఐ ఎకానమిస్ట్‌‌ అన్నారు. బడ్జెట్‌‌ సమయంలో దీనిని ప్రభుత్వం జీడీపీలో 3.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీనిపై పూర్తి స్పష్టత రావడానికి మార్చి 16 వరకు వేచి చూడాలని ఎస్‌‌బీఐ ఆర్థిక వేత్త తెలిపారు. మార్చి 16 తర్వాత దేశ ఆర్థిక గణాంకాలలో గణనీయమైన మార్పు వస్తుందని అన్నారు.

లేచి పడిన టెల్కో షేర్లు

భారతీ ఎయిర్‌‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, టాటా గ్రూప్‌ కంపెనీలు  తమ ఏజీఆర్‌‌ బకాయిలలో కొంత భాగాన్ని చెల్లించడంతో  వీటి షేర్లు సోమవారం సెషన్‌లో గరిష్టాలకు చేరుకున్నాయి.  భారతీ ఎయిర్‌‌టెల్‌ షేరు ఇంట్రాడేలో రూ. 568.70 వద్ద ఆల్‌టైమ్‌ హైని తాకింది. కానీ ప్రాఫిట్‌ బుకింగ్‌ జరగడంతో చివరికి 0.07 శాతం లాభపడి రూ. 565.40  వద్ద ముగిసింది. అదేవిధంగా వొడాఫోన్‌ ఐడియా ఇంట్రాడేలో రూ.4.20 ను తాకినప్పటకి చివరి 1.47 శాతం నష్టంతో 3.35 వద్ద క్లోజయ్యింది. టాటా టెలీ సర్వీసెస్‌ మాత్రం 9.09 శాతం లాభపడి రూ. 3.60 వద్ద ముగిసింది.

Latest Updates