శాటిలైట్ సాయంతో వ్యవసాయం…

agriculture-in-britain-with-satellite-assistant

వ్యవసాయం.. ప్రపంచానికి తిండి పెట్టే రంగం.  ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లాలంటే ఆ రంగం బాగుండాలి. కానీ సాగు పరిస్థితి బాగలేదు. రైతులకు ‘వ్యయ’సాయమే తప్ప వ్యవ‘సాయం’ అందడం లేదు. ఎక్కడ చూసినా సంక్షోభం నెలకొంది. పంటలు పండటం లేదు. పండినా ఎక్కువ దిగుబడి రావడం లేదు. వచ్చినా మద్దతు ధర దొరకడం లేదు. దీంతో ఎందరో రైతులు సచ్చిపోతున్నరు. కొందరు వ్యవసాయం వదిలేస్తున్నరు. మరికొందరు అందులోనే బతుకీడుస్తున్నరు. ఈ క్రమంలో క్రాప్ ప్రొడక్షన్ పెంచేందుకు సైంటిస్టులు ఓ రీసెర్చ్ మొదలుపెట్టారు. ఒక్కో పంట తీరును ప్రత్యేకంగా అంచనా వేసేందుకు శాటిలైట్ సిస్టమ్​ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే పదేళ్లలో కొత్త సిస్టమ్​ను అందుబాటులోకి తీసుకొస్తామని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

మొక్కలు ఎంత తాగుతయి?

వ్యవసాయ ప్రాంతాల్లోని భూముల ఉష్ణోగ్రతలపై సర్వే చేసేందుకు ఓ శాటిలైట్ సిస్టమ్​ను యూరోపియన్ యూనియన్ సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు. మొక్కలు ఎంత మొత్తంలో నీటిని వాడుకుంటాయి? అలా వాడుకున్న నీటిని మళ్లీ వాతావరణంలోకి ఏ రూపంలోకి విడుదల చేస్తాయి అనే విషయాలను అంచనా చేయనున్నారు. ఒక పంటకు ఎంత మొత్తంలో నీరు అవసరం? కరువుకు సదరు పంట ఎలా తట్టుకుంటోంది? వంటి అంశాలను మానిటర్ చేసేందుకు ఈ డేటా ఉపయోగపడనుంది. యూరోపియన్ యూనియన్ చేపట్టిన ‘కోపర్నికస్’ అనే ఎర్త్ అబ్జర్వేషన్​ప్రోగ్రామ్ లో ఈ కొత్త సిస్టమ్​ను చేర్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఈయూ ‘సెంటినల్స్’ పేరుతో స్పేస్ లోకి పంపుతున్న శాటిలైట్లకు ఇది అదనం.

9,884 ఎకరాలు

బ్రిటన్​లోని కింగ్స్ కాలేజ్​లండన్​కు చెందిన ప్రొఫెసర్ మార్టిన్ ఊస్టర్ టీమ్ ఈ శాటిలైట్ ప్రోగ్రామ్​పై పని చేస్తోంది. వ్యవసాయానికి ప్రయోజనం కలిగించడం, క్రాప్ ప్రొడక్షన్​పెంచడమే తమ ముఖ్య లక్ష్యమని మార్టిన్ అన్నారు. ల్యాండ్ సర్ఫేస్ టెంపరేచర్ మానిటరింగ్ (ఎల్ఎస్​టీఎం) మిషన్ అనే శాటిలైట్ కాన్సెప్ట్​లో భాగంగా ఈ రీసెర్చ్ చేస్తున్నారు. కొత్త సిస్టమ్​తో 40 చదరపు కిలోమీటర్ల (సుమారు 9884 ఎకరాలు) పరిధిలోని పంటల టెంపరేచర్లను ఒకేసారి ఐడెంటిఫై చేయొచ్చు. ప్రస్తుతమున్న సిస్టమ్​తో పోలిస్తే 10 రెట్లు స్పష్టంగా, కచ్చితంగా అంచనా వేయవచ్చు. ఈ కచ్చితత్వం వల్ల సాగు, దిగుబడి, పంటల తీరు వృద్ధి చెందనుంది. వివిధ ప్రాంతాల్లో పెరిగే పలు రకాల మొక్కలకు ఎంత మొత్తంలో నీరు అవసరం? అక్కడ ఎంత మొత్తంలో, ఎంత విస్తీర్ణంలో పంట సాగు చేయాలి? అనే విషయాలను తెలుసుకునేందుకు రీసెర్చర్లకు ఎల్ఎస్​టీఎం మిషన్ సాయపడనుంది. అలాగే కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసేందుకు వీలు కలుగుతుంది.

ముందుగా లండన్​లో..

తన రీసెర్చ్ లో భాగంగా తొలుత లండన్​లో ఏరియల్ హీట్ మ్యాపులను సేకరించాలని ప్రొఫెసర్ ఊస్టర్ నిర్ణయించారు. అలాగే బ్రిటన్ (లండన్ మినహా), ఇటలీ, జర్మనీ వ్యవసాయ ప్రాంతాల్లో కూడా వివరాలను కలెక్ట్ చేయనున్నారు. ఇందుకోసం హైపర్​స్పెక్ట్రల్ థెర్మల్ ఎమిషన్ స్పెక్ర్టోమీటర్ (హైటెస్) ఉపయోగిస్తారు. దీని ద్వారా అత్యంత కచ్చితత్వంతో కూడిన ఇమేజ్​లను తీస్తారు. భూగర్భ పరిస్థితుల వివరాలు, కరువు వచ్చినప్పుడు పంటలు స్పందించే తీరును రికార్డు చేస్తారు. ఎల్ఎస్​టీఎం కోసం ఉద్దేశించిన ఇమేజింగ్ సిస్టమ్​లో పొందుపరుస్తారు. వచ్చే పదేళ్లలో ఎల్ఎస్​టీఎం ఓ ‘స్పేస్​క్రాఫ్ట్’గా పని చేయడం ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు

Latest Updates