
కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ‘కేజీయఫ్2’ సినిమా టాపిక్కే. సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. కొన్ని వారాలుగా ప్రమోషన్స్ని పీక్స్కి తీసుకెళ్లారు మేకర్స్. దేశం నలుమూలలా తిరిగి సినిమాకి చాలా హైప్ తెచ్చారు. నిన్న కూడా ఓ పాటను రిలీజ్ చేసి ఆ అంచనాలను మరింత పెంచారు. ‘రణ రణ రణధీర.. గొడుగెత్తె నీల గగనాలు.. పదమొత్తె వేల భువనాలు.. తలవంచె నీకు శిఖరాలు.. జేజేలు పలికె ఖనిజాలు’ అంటూ యశ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసిందీ పాట. రవి బస్రూర్ ట్యూన్కి రామజోగయ్య శాస్త్రి పవర్ఫుల్ లిరిక్స్ రాశారు. శ్రీకృష్ణ, పృథ్వీచంద్ర, అరుణ్ కౌండిన్య, సాయి చరణ్, సంతోష్ వెంకీ, మోహన్ కృష్ణ, సచిన్ బస్రూర్, రవి బస్రూర్, పునీత్ రుద్రనాగ్, మనీష్ దినకర్, హరిణి ఇవటూరి కలిసి పాడిన ఈ పాట సినిమాకు హైలైట్ అంటున్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రవీనా టాండన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ నీల్ దర్శకుడు.