ఈ అంకిత అందరికీ ఆదర్శం

ఒక మహిళ ఆటో నడపడం అంటేనే కష్టమైన పని. మరి ఫిజికల్లీ చాలెంజ్​డ్​ అయితే ఇంకా కష్టం. తన లోపాన్ని పక్కనపెట్టి, చక్కగా ఆటో నడుపుతోంది అహ్మదాబాద్​కు చెందిన అంకితాబేన్​ షా. ఆర్థిక పరిస్థితులు, అవసరాలు ఆమెను ఆటో డ్రైవర్​గా మార్చాయి. మగవాళ్లతో సమానంగా ఆటో నడుపుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. ఇంతకీ అంకిత​ ఆటో డ్రైవర్​గా ఎందుకు మారింది?

అహ్మదాబాద్‌‌‌‌ రైల్వేస్టేషన్‌‌ దగ్గర ఆటోతో కనిపిస్తుంది అంకితాబెన్‌‌. గుజరాత్​లో ఆమెను గుర్తుపట్టనివాళ్లు చాలా తక్కువ. అంతలా అందరి దృష్టిని ఆకర్షించడానికి కారణం ఫిజికల్లీ చాలెంజ్​డ్​ అయి కూడా ధైర్యంగా ఆటో నడుపుతుండడమే. తండ్రి ట్రీట్​మెంట్​ కోసం ఆమె ఆటో డ్రైవర్​గా మారింది. ‘‘మేం ఐదుగురు పిల్లలం. అందరిలో పెద్దదాన్ని. మా నాన్న అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. కుటుంబ పోషణ భారమైంది. నాన్నకు ట్రీట్​మెంట్​ ఇప్పించాలి. కుటుంబ అవసరాలు తీర్చాలి. ‘ఆటో నడిపి నాన్నకు ట్రీట్​మెంట్​ ఇప్పిస్తా’ అని అంటే కొంతమంది నవ్వారు. ‘ఫిజికల్లీ చాలెంజ్​డ్​ కదా, అందులోనూ​ ఆడపిల్లవు ఆటో ఎలా నడుపుతావ్​’ అన్నారు. ఆడపిల్లనైనా చదువు చెప్పించారు. ఏ లోటు లేకుండా పెంచారు. అందరిలాగా చూసుకున్నారు. అందుకే నాన్న కోసం ఆటో నడపడం మొదలుపెట్టా’ అంటారు అంకిత.

పోలియోతో…

అంకితాబెన్‌‌ది గుజరాత్​లోని సూరత్‌‌ దగ్గర చిన్న గ్రామం. చిన్నప్పుడు పోలియోబారిన పడింది. తండ్రి ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. ఎక్కడ ట్రీట్​మెంట్​ ఇప్పించినా ఫలితం లేకుండాపోయింది. సరైన ట్రీట్​మెంట్​ అందక కాలిలో కొంత భాగం తీసేయక తప్పలేదు. బిడ్డకు లోటు రాకుండా పెంచేందుకు ఆర్టిఫీషియల్​ లెగ్​ అమర్చాడు. అందరి పిల్లల్లా ఆడుకోలేకపోయినా తన పనులు తాను చేసుకోగలదు. అంకితను చదివిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్మి, డిగ్రీ చదివించాడు తండ్రి. ఏదైనా ఉద్యోగం వస్తే, ఎవరిపైనా ఆధారపడకుండా ఉంటుందని ఆయన ఉద్దేశం. అంకిత కూడా తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుంది. డిగ్రీ పాసయ్యింది.

ఉద్యోగానికి అడ్డంకులు

కష్టపడి డిగ్రీ చదివినా, ఉద్యోగానికి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అంకిత. అహ్మదాబాద్‌‌లోని ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఫిజికల్లీ చాలెంజ్​డ్​ అనే ఒక్క కారణంతో చాలా కంపెనీలు ఉద్యోగానికి ‘నో’ చెప్పాయి. చివరకు ఒక స్కూల్‌‌లో క్లర్క్‌‌ ఉద్యోగం వచ్చింది. ‘కొన్నిరోజులు పనిచేస్తేనే, ఆ తర్వాత శాలరీ ఇస్తాం’ అని అగ్రిమెంట్​ తీసుకుంది ఆ స్కూల్​ మేనేజ్​మెంట్​. ఆరు నెలలు పనిచేసినా సరైన శాలరీ ఇవ్వలేదు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేసినా, నిరాశే ఎదురైంది. ‘‘ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీసులు తిరిగా. డిగ్రీ సర్టిఫికెట్​ ఉన్నా కూడా రిజెక్ట్​ చేశారు. నా డిజేబులిటీ​ సాకుగా చూపేవాళ్లు. ఇంటర్వ్యూలో నెగ్గినా జాబ్​ ఇచ్చేవాళ్లు కాదు. ఎన్నో ప్రయత్నాలు చేయగా కాల్​ సెంటర్​లో ఉద్యోగం దొరికింది. పని గంటలు ఎక్కువ. జీతం తక్కువ. అయినా జాబ్​ చేశా. నెలకు పన్నెండు వందలు. లైఫ్​ హ్యాపీ అనుకున్న టైంలో నాన్నకు క్యాన్సర్​ వచ్చింది. కుటుంబ పోషణ ఆగింది. పెద్ద బిడ్డగా నేను బాధ్యత తీసుకున్నా. నా కోసం నాన్న ఎంతో కష్టపడ్డాడు. ఆయనకు ట్రీట్​మెంట్​ అందించాలనుకున్నా. నాన్నను హాస్పిటల్​కు తీసుకెళ్లాలి అంటే కచ్చితంగా ఆఫీసుకు సెలవు పెట్టాలి. ఒకపక్క ఉద్యోగం చేస్తూ, మరోపక్క ట్రీట్​మెంట్​ చేయిస్తూ హాస్పిటల్స్​ చుట్టూ తిరిగా. దాంతో ఉద్యోగానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. నా వల్ల సమస్య ఉండకూడదని జాబ్​కు​ రిజైన్​ చేశా”అని చెప్పింది అంకిత.

ఆటో నడపడం నేర్చుకొని

ఉద్యోగానికి రిజైన్​ చేసినట్లు ఇంట్లోవాళ్లకు చెప్పింది అంకిత. ఎవరూ ఏమీ అనలేదు. కానీ ‘ఆటో నడుపుతా’ అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. అంకితకు తెలిసిన ఒక ఆటో డ్రైవర్‌‌ దగ్గర డ్రైవింగ్‌‌ నేర్చుకుంది. ఆయన అంకితలాగే ఫిజికల్లీ చాలెంజ్​డ్​ పర్సనే. చిన్న చిన్న మార్పులు చేసుకొని ఆటో నడపడం మొదలుపెట్టింది. రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తుంది. నెలకు ఇరవై ఐదు వేల వరకు సంపాదిస్తోంది. కుటుంబ అవసరాలకు డబ్బు సరిపోకపోతే, మరో రెండు గంటలు ఆటో నడుపుతుంది. ‘‘ఆటో నడపడం చూసి కొంతమంది విమర్శించేవాళ్లు. అవన్నీ పట్టించుకోలేదు. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎన్నో ఆఫీస్​లు తిరిగా. ఎక్కడా నన్ను గౌరవించలేదు. ఇప్పుడు నా పని నేను చేసుకుంటున్నా. ఎవరినీ సెలవులు అడగాల్సిన పనిలేదు. ఆటో నడపడం ఎంతో ఆనందాన్నిస్తుంది. సంపాదించిన డబ్బుతో నాన్నకు ట్రీట్​మెంట్​​ ఇప్పిస్తున్నా. తమ్ముడికి ఆటో నేర్పి, పనిలో పెడతా. ఆటోతోనే నా లైఫ్​ బాగుంది” అని అంటోంది అంకిత.

Latest Updates