మనుషులను రీప్లేస్ చేయలేదు..ఏఐ ఒక ప్రత్యామ్నాయ అప్లికేషన్ మాత్రమే : రాజశేఖర్ వంగపాటి

మనుషులను రీప్లేస్ చేయలేదు..ఏఐ ఒక ప్రత్యామ్నాయ అప్లికేషన్ మాత్రమే : రాజశేఖర్ వంగపాటి
  • స్కిల్స్ ఉన్నోళ్లకు అంతర్జాతీయంగా మంచి అవకాశాలు 
  • న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అకడమిక్ కౌన్సిలర్ రాజశేఖర్ వంగపాటి

హైదరాబాద్, వెలుగు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ని ఒక సాఫ్ట్ వేర్ ఆధారిత అప్లికేషన్ గా మాత్రమే చూడాలని, మానవ వనరులను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయలేదని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, అకడమిక్ కౌన్సిలర్ రాజశేఖర్ వంగపాటి అన్నారు. అంతర్జాతీయంగా చర్చిస్తున్న విషయాలను, అందోళనలను పరిగణలోకి తీసుకుని ఈ విషయంపై మరింత చర్చ జరగాల్సిఉందన్నారు.

ఆదివారం నిజాం కాలేజీలో ఇగ్నో స్టడీ సెంటర్(ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ), నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం) సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆందోళనలు, అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు, ఉద్యోగ అవకాశాలపై నిర్వహించిన సెమినార్ లో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు.

అమెరికా యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం మెరుగైన అకడమిక్ గ్రేడ్స్ తో పాటు భాషా నైపుణ్యం, ఇతర సామాజిక అంశాలపై పట్టు ఉండటం అవసరమని తెలిపారు. ప్రస్తుత రాజకీయ, భౌగోళిక పరిస్థితుల వల్ల ఉద్యోగాలపై తాత్కాలిక ప్రభావం ఉన్నా, రానున్న రోజుల్లో నైపుణ్యం ఉన్నవాళ్లకు అమెరికాలో మెరుగైన ఉద్యోగాలు దొరుకుతాయని అన్నారు. ఇగ్నో రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రాజు బొల్ల, అకడమిక్ సిబ్బందితో పాటు, విద్యార్థులు పాల్గొన్నారు.