238 కాలేజీలకు గుర్తింపు టెన్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలోని ప్రైవేటు ప్రొఫెషనల్, టెక్నికల్​కాలేజీల గుర్తింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రూల్స్​కు విరుద్ధంగా ఉన్న కాలేజీలకు 2020–21లో అఫ్లియేషన్​ఇచ్చే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఏఐసీటీఈ (ఆల్​ఇండియా కౌన్సిల్​ఫర్​టెక్నికల్​ఎడ్యుకేషన్) తాజాగా ప్రకటించడం.. జీవో నంబర్​111ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ప్రైవేటు ప్రొఫెషనల్​కాలేజీల మేనేజ్​మెంట్లు అయోమయంలో పడ్డాయి. ఏఐసీటీఈ రూల్స్, జీవో నంబర్ 111.. రెండూ అమలైతే ఏకంగా 200లకు పైగా కాలేజీలు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు.

అక్టోబర్ 31తో ముగిసిన గడువు

రాష్ర్టంలో సుమారు 800లకు పైగా ప్రొఫెషనల్ (ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ…)​ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీల్లో ఉండే ఇన్​ఫ్రాస్ర్టక్చర్​కు అనుగుణంగా ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తుంది. ఆయా కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులను పరిశీలించి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇస్తుంటాయి. వసతుల్లేవన్న కారణంతో ఓ ప్రైవేటు కాలేజీ గుర్తింపును నాలుగేండ్ల క్రితం ఏఐసీటీఈ రద్దు చేసింది. దీంతో ఆ కాలేజీ ప్రతినిధి తనలాగే మిగిలిన కాలేజీలకు వసతులు, బిల్డింగ్ అనుమతులు లేవని, వాటిపైనా చర్యలు తీసుకోవాలని ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో అన్ని కాలేజీల్లో ఏఐసీటీఈ తనిఖీలు చేసింది. 238 ప్రొఫెషనల్ కాలేజీలు జీవో నంబర్ 111లోని రూల్స్​కు, ఏఐసీటీఈ రూల్స్​కు విరుద్ధంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధానంగా బిల్డింగ్​రెగ్యులరైజేషన్, బిల్డింగ్​మాస్టర్​ప్లాన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులతోపాటు ఇతర వసతులు లేవని తేల్చారు. దీంతో వసతులు సమకూర్చుకునేందుకు ఏఐసీటీఈ నుంచి కాలేజీల మేనేజ్​మెంట్లు అనుమతి తీసుకున్నాయి. ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు 2019 అక్టోబర్ 31తో ముగిసింది. ఈనేపథ్యంలో అనుమతులు, సరైన పత్రాలు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఏఐసీటీఈ ప్రకటించింది. 238 కాలేజీల్లో ఇంజనీరింగ్​కాలేజీలే ఎక్కువగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు.వీటిలో కొన్ని కాలేజీల్లో వసతులు కల్పించినట్టు మేనేజ్​మెంట్లు చెప్తున్నాయి. వీటి నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.

ఆ 50 కాలేజీలకు అనుమతిస్తారా..?

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా హైదరాబాద్ శివారులోని ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ సరస్సుల రక్షణ కోసం భవనాల నిర్మాణాలకు రూల్స్ రూపొందిస్తూ ఉమ్మడి రాష్ర్టంలో 1996లో అప్పటి సర్కారు జీవో నంబర్ 111 ఇచ్చింది. దీని ప్రకారం ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ దగ్గర 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు విధించింది. అయితే ఆ రూల్స్​కు వ్యతిరేకంగా ప్రైవేటు కాలేజీల మేనేజ్​మెంట్లు పెద్దపెద్ద బిల్డింగ్స్​నిర్మించాయి. దీంతో సుమారు 50 ప్రొఫెషనల్​కాలేజీల్లో బిల్డింగ్​రెగ్యులరైజేషన్ కు ప్రభుత్వం నిరాకరిస్తోంది. కాలేజీ అఫ్లియేషన్​కు తప్పనిసరిగా బిల్డింగ్​రెగ్యులరైజ్​అయి ఉండాలనే రూల్ ఉంది. ఏటా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులిస్తూ పోతోంది. ఉస్మాన్​సాగర్, హిమాయత్​సాగర్ సరస్సుల్లో నీళ్లు లేవు కాబట్టి జీవోను సవరించి, భవనాలకు అనుమతులు ఇవ్వాలనే డిమాండ్​కూడా చాలా ఏండ్ల నుంచి ఉంది. కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్​గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సర్కారు అనుమతి ఇవ్వకపోతే, దాదాపు 50 కాలేజీలకు గుర్తింపు రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు. 111 జీవోను సవరించి కాలేజీ బిల్డింగ్స్​ను రెగ్యులరైజ్​చేయాలని ప్రభుత్వాన్ని ప్రైవేటు ఇంజినీరింగ్​కాలేజీ మేనేజ్మెంట్స్ స్టేట్ ప్రెసిడెంట్​గౌతమ్ రావు కోరుతున్నారు.