తెలంగాణలోనే అధికం : కొత్తగా 13 వేల మందికి ఎయిడ్స్‌

కొత్తగా 13 వేల మందికి ఎయిడ్స్‌!‌

దేశవ్యాప్తంగా తెలంగాణలోనే అధికం

రాష్ర్టంలో మొత్తం 2.03 లక్షల మంది బాధితులు

దేశవ్యాప్తంగా 21.4 లక్షలు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ర్టంలో ఎయిడ్స్ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కొత్త కేసుల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉండగా, పశ్చిమ బెంగాల్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. గతేడాది సెప్టెంబర్‌‌ నాటికి దేశవ్యాప్తంగా 87.58 వేల మంది కొత్తగా ఎయిడ్స్‌ భారిన పడగా, తెలంగాణలో అధికంగా 9324 మందికి సంక్రమించిందని న్యాకో(నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్) వెల్లడించింది. అయితే, నవంబర్ చివరి నాటికి ఈ సంఖ్య 11,820కి చేరిందని రాష్ర్ట ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రకటించింది. అంటే, రెండు నెలల్లోనే రాష్ర్టంలో 2496 కొత్త కేసులు గుర్తించారు. 8605 మందితో రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్, 8854 మందితో బిహార్‌‌, 7055 మందితో ఉత్తర ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శాతపరంగా మిజోరం(2.04) తొలి స్థానంలో ఉండగా,  మణిపూర్(1.43), నాగాలాండ్‌(1.15), తెలంగాణ(0.7) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

రాష్ర్టంలో 2.03 లక్షలు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21.4 లక్షల మంది హెచ్‌ఐవీతో బాధపడుతుండగా, రాష్ర్టంలో 2.03 లక్షల మంది ఎయిడ్స్‌ పేషెంట్లు ఉన్నారు. వీరిలో 90,392 మంది మహిళలున్నారు. అత్యధికంగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులున్న రాష్ర్టాల్లో 3.29 లక్షల మందితో మహారాష్ర్ట, 2.69 లక్షలతో ఆంధ్రప్రదేశ్, 2.47 లక్షల మందితో కర్ణాటక తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. గతేడాది ఎయిడ్స్‌ వ్యాధి కారణంగా దేశవ్యాప్తంగా 69,110 మంది మరణించగా, రాష్ర్టంలోనే అత్యధికంగా 10,157 మంది మరణించారు. 10,104 మరణాలతో మహారాష్ర్ట రెండో స్థానంలో 8460 మరణాలతో ఏపీ మూడో స్థానంలో ఉంది.

అర్బన్‌లోనే అధికం

రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎయిడ్స్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ(ఏసీఎస్‌) అధికారులు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సంఖ్య అధికమవుతోందన్నారు. వివిధ రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న యువతపై తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడం, నగరాల్లో సెక్స్‌ వర్కర్లు ఎక్కువగా ఉంటుండడం ఇందుకు ఓ కారణమని వారు వివరించారు. కొత్తగా ఎయిడ్స్‌ భారిన పడుతున్న వారిలో సెక్స్‌ వర్కర్లు, సరుకు రవాణావాహనదారులు, స్వలింగ సంపర్కులు అధికంగా ఉంటున్నారని తెలిపారు. లైంగిక వ్యాధులపై అవగాహన ఎక్కువగా ఉండే అర్బన్‌లో నిర్లక్ష్యమే ముప్పుగా పరిణమిస్తోందన్నారు. సంపర్క సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

Latest Updates