ఎయిరిండియా లాభం ₹679 కోట్లు

ఏకంగా 283 శాతం పెరుగుదల 

75 శాతం పెరిగిన రెవెన్యూలు

ముంబై: ప్రభుత్వరంగ ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీ ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా, ఈ కంపెనీ గత డిసెంబరు 31తో ముగిసిన క్వార్టర్‌‌కు అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ3లో రూ.679 కోట్ల లాభం సంపాదించినట్టు గురువారం తెలియజేసింది. ఈ ఏడాది క్రితం క్యూ3లో వచ్చిన రూ.177 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 283 శాతం పెరిగింది. ఇదేకాలంలో ఆదాయం 75 శాతం పెరిగి రూ.3,124 కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమ ఆపరేటింగ్‌‌ రెవెన్యూల విలువ రూ.ఐదు వేల కోట్లు దాటుతుందని ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ సీఈఓ శ్యామ్‌‌సుందర్‌‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో   ఈ కంపెనీకి రూ.4,171 కోట్ల ఆదాయం, రూ.168 కోట్ల నికరలాభం వచ్చింది. ఈ ఏడాది వేసవిలో తిరుచురాపల్లి–అబూదబీ, తిరుచురాపల్లి–దోహా ఫ్లైట్లను మొదలుపెడతామని తెలిపింది. తిరుచురాపల్లి–అబూదబీ సర్వీసును వారానికి నాలుగుసార్లు నడిపిస్తారు. దోహా ఫ్లైట్‌‌ వారానికి మూడుసార్లు ఉంటుంది. ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ దగ్గర ప్రస్తుతం 25 బోయింగ్‌‌ 737–800 ఎన్జీ విమానాలు ఉన్నాయి.

అమ్మకానికి రెడీ

పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలో భాగంగా ఎయిరిండియాలో 100 శాతం వాటాలను అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం ఈ నెల మొదటివారంలో ప్రకటించింది. ఇందులో మెజారిటీ వాటాను అమ్మేందుకు 2018లోనూ ప్రయత్నాలు చేసినా, ఏ ఒక్క కంపెనీ కూడా స్పందించలేదు. ఎయిరిండియాను కొనడానికి  ఏడాది మార్చి 17లోపు ఎక్స్‌‌ప్రెషన్‌‌ ఆఫ్‌‌ ఇంట్రెస్ట్‌‌ (ఈఓఐ) ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. బిడ్డింగ్‌‌లో గెలిచిన వాళ్లు ఎయిరిండియా ఆస్తులను తీసుకోవడంతోపాటు అది చేసిన రూ.25 వేల కోట్లకుపైగా అప్పులనూ భరించాల్సి ఉంటుంది. అంతేగాక మూడుశాతం షేర్లను కంపెనీ పర్మనెంట్‌‌ ఉద్యోగులకు ఈఎస్‌‌ఓపీ రూల్స్‌‌ ప్రకారం ఇవ్వాలి. ఎంప్లాయిస్ స్టాక్‌‌ ఆప్షన్స్‌‌ కింద ప్రభుత్వం 98 కోట్ల షేర్లను జారీ చేసే అవకాశం ఉంది. ఎయిరిండియాలో వందశాతం వాటాతోపాటు ఏఐఎస్‌‌ఏటీఎస్‌‌లో 50 శాతం వాటాను అమ్ముతారు. ఐఏఎస్‌‌ఏటీఎస్‌‌ను గ్రౌండ్‌‌ హ్యాండ్లింగ్ సర్వీసుల కోసం సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌తో కలిసి ఏర్పాటు చేశారు. బిడ్డింగ్‌‌ గెలిచిన కంపెనీకే ఎయిరిండియా మేనేజ్‌‌మెంట్‌‌ కంట్రోల్‌‌ను కూడా బదిలీ చేస్తారు.   ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ కంపెనీలకు రూ.23,286 కోట్ల అప్పులు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది నవంబరు నాటి లెక్కల ప్రకారం ఈ రెండు సంస్థలకు 16,077 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో కాంట్రాక్టు ఉద్యోగులూ ఉన్నారు.

Latest Updates