ఎయిర్ స్ట్రెయిక్ ఎప్పుడో జరగాల్సింది: అమరుడి తండ్రి

మీరట్: పాక్ పై ప్రతీకార దాడిని అమర జవాన్ల కుటుంబాలు పండుగలా జరుపుకుంటున్నాయి. సైనికుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ముష్కర మూకలను మట్టుబెట్టడంతో స్వీట్లు పంచుకుంటున్నాయి. సరిహద్దు దాటి జైషే ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించడం చాలా సంతోషంగా ఉందని ఓ అమర జవాన్ తండ్రి అన్నారు. పుల్వామా దాడిలో అమరుడైన యూపీలోని మీరట్ కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ అజయ్ కుమార్ తండ్రి మాట్లాడుతూ ఎంత కాలం వీర జవాన్లు ప్రాణ త్యాగం చేయాలని ఆవేదనగా ప్రశ్నించారు. వాయుసేన ఇవాళ చేసిన దాడి ఎన్నో ఏళ్ల క్రితమే జరగాల్సిందని అన్నారు.

ఈ నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషే ఉగ్రవాది ఆదిల్ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. వీర జవాన్ల ప్రాణ త్యాగానికి ప్రతీకారంగా పాక్ పై గట్టి దెబ్బ కొట్టాలని యావద్దేశం నాటి నుంచి డిమాండ్ చేస్తోంది. రెండు వారాల్లోపే ఇవాళ తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో మన వాయుసేన పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైషే ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టి వచ్చింది. పాక్ చెంప చెళ్లుమనిపించింది.

Latest Updates