16 వేల కిలోమీటర్లు.. 17 గంటలు.. 30 వేల ఫీట్ల ఎత్తు.. ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల రికార్డు

ఎయిర్ ఇండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు రికార్డు సృష్టించారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు నాన్‌స్టాప్ డైరెక్ట్ ఫ్లైట్ నడిపారు.  అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు 16 వేల కిలోమీటర్లు విమానాన్ని నడిపి అద్భుతం సృష్టించారు. కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ పాపగారి తన్మయి, కెప్టెన్ ఆకాంక్షా సోనావేర్ మరియు కెప్టెన్ శివానీ మన్హాస్‌లు ఈ ఘనత సాధించారు. ఎయిర్ ఇండియాకు చెందిన AI176 విమానంలో ఈ నలుగురు మహిళా పైలట్లు శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి శనివారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరు ఈ విమానంలో అతిక్లిష్టమైన ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటలపాటు 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం చేసి ఈ ఘనతను సాధించారు.

నలుగురు మహిళలు ఈ ఘనతను సాధించడం పట్ల కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. పైలట్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఘనత సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని కెప్టెన్ జోయా అగర్వాల్ అన్నారు. ‘ఉత్తర ధ్రువం మీదుగా 30 వేల అడుగుల ఎత్తులో 16 వేల కిలోమీటర్లు ప్రయాణించాం. ఈ మార్గంలో రావడం వల్ల 10 టన్నుల ఇంధనాన్ని ఆదా చేయగలిగాం. ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణం చేయడం చాలా కష్టం. అటువంటి మహిళా పైలట్లం మాత్రమే ఈ ప్రయాణం చేయడం చాలా గొప్ప విషయం’ అని ఆమె అన్నారు.

For More News..

నిమ్స్ హాస్పిటల్ వెనుక ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

రూ.5 లక్షల నుంచి వెయ్యి కోట్ల కంపెనీగా విశాక

దాదాకు బదులుగా జై షా

Latest Updates