నీ వల్లే కేన్సర్ వచ్చింది: అజయ్ కి అభిమాని లెటర్

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ పలు పొగాకు సంబంధమైన ఉత్పత్తులకు ప్రచారం చేస్తున్నారు. అతడి ప్రచారం చూసి వాటి వైపు ఆకర్షితులైన అభిమాని ఇపుడు కేన్సర్ బారిన పడ్డారు. అతడి పేరు నానక్‌రాం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ 40 ఏళ్ల ఈ అభిమాని.. అజయ్ దేవ‌గన్ ఇకపై పొగాకు ప్రాడక్టులకు ప్రచారం చేయడం ఆపాలని కోరుతున్నారు. నానక్‌రాం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌కు వీరాభిమాని. ఆయన ప్రచారం చేసే పొగాకు ఉత్పత్తులనే కొన్నేళ్లుగా వాడుతున్నాడు. అయితే వాటి ప్రభావం తనపై ఎలా పడిందో ఇపుడు తెలుసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

అజయ్ దేవగన్ పొగాకు ఉత్పత్తులకు ప్రచారం చేయడం ఆపాలని కోరుతూ నానక్‌రాం లెటర్ ను అజయ్ కి పోస్టు చేశాడు. పొగాకు వల్ల తాను, తమ కుటుంబం ఎంత ఎఫెక్ట్ అయ్యామో చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు దీనికి దాదాపు వెయ్యి పాంప్లెట్స్ ను సంగానర్, జగత్‌పురా ప్రాంతాల్లో గోడలకు అంటించారు. అజయ్‌ లాంటి స్టార్‌ సెలబ్రిటీలు ఇటువంటి ఉత్పత్తులకు ప్రచారం కల్పించకూడదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మా నాన్న నానక్‌రాం గత కొన్నేళ్లుగా పొగాకు నములుతున్నాడు. అజయ్ దేవగన్ ప్రచారం చేసే ఉత్పత్తులనే వాడుతున్నాడు. అపుడు ఆయన ఆ ప్రకటనలు చూసి ఆకర్షితులయ్యాడు. కానీ ఇపుడు కాన్సర్ బారిన పడ్డ తర్వాత అలాంటి ఉత్పత్తులకు అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ ప్రచారం చేయకూడదను అని కోరుకుంటున్నాడని నానక్‌రాం కుమారుడు దినేష్ తెలిపాడు.

నానక్‌రాం కు ఇద్దరు పిల్లలు. రాజస్థాన్‌లో సంగానేర్‌లో టీ స్టాల్ నడిపిస్తూ జీవనం సాగించేవాడు. క్యాన్సర్ కారణంగా ఇపుడు అతడు పని చేయలేక పోతున్నాడు. ఇప్పుడు అతను వ్యాధి బారిన పడటంతో కుటుంబ బాధ్యత కుమారుడు దినేష్ పై పడింది. అయితే ఈ అంశంపై అజయ్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Latest Updates