నల్ల బియ్యంతో మస్తు లాభం..కిలో రూ.200 నుంచి 500

నల్ల బియ్యాన్ని ‘కాలాబట్టి’ అని కూడా పిలుస్తారు. వీటిని కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన ఆవుల అజిత్‌‌కుమార్ పండిస్తున్నాడు. సేంద్రియ పద్ధతుల్లో ఐదెకరాల్లో ఏడాదికి రెండు పంటలు వేస్తున్నాడు. బ్లాక్‌‌ రైస్‌‌తోపాటు సన్న రకం సువాసన బియ్యం, మరో 20 రకాల వడ్లను పండిస్తున్నాడు అజిత్‌‌. వీటితో పాటు వాణిజ్య పంట ‘కొలంబో కంది’ని 4 ఎకరాల్లో పండిస్తున్నాడు. పెట్టుబడులు పోనూ ప్రతి పంటకు ఆరు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కొలంబో కంది ఒక్కసారి నాటితే నాలుగు సంవత్సరాల వరకు కాత కాస్తుంది. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. బ్లాక్​ రైస్​ ఎకరానికి 30 క్వింటాళ్ల వడ్లు పండుతాయి. బ్లాక్‌‌ రైస్‌‌ను ఆయనే మార్కెట్‌‌ చేసుకుంటున్నాడు. కేజీ బియ్యం ధర సీజన్‌‌ను బట్టి  200 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ధర ఉంటుంది. ఎవరు ఆర్డర్‌‌‌‌ ఇచ్చినా, చెప్పిన టైంకు డెలివరీ‌‌ చేస్తుంటాడు అజిత్‌‌. వీటిని విత్తనాలుగా వాడేందుకు రైతులే ఎక్కువగా  కొంటున్నారు.

తల్లికి క్యాన్సర్​ రావడంతో…

నాలుగు సంవత్సరాల క్రితం అజిత్​ తల్లికి నోటి క్యాన్సర్​ వచ్చింది. అప్పుడు ఒక బంధువు బ్లాక్‌‌ రైస్‌‌ తో క్యాన్సర్‌‌‌‌ తగ్గుతుందని చెప్పడంతో తన పొలంలో ఈ పంట వేశాడు. ఇంట్లో వాళ్లందరూ ఈ బియ్యమే తింటున్నారు. వీటివల్ల తన తల్లికి క్యాన్సర్​ తగ్గడంతో పాటుగా ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉన్నట్టు అజిత్‌‌ చెప్తున్నాడు.

ఔషధాల గని

‘‘ఈ బియ్యం నల్లగా ఉండడం వల్ల ‘కాలాబట్టి’ అంటారు. యాంథోసైనిన్​ ఉండడం వల్ల బియ్యం నలుపు రంగులో ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్​ తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్​ను పెంచుతుంది. డయాబెటిస్​ రాకుండా అడ్డుకుంటుంది.  ఇందులో బి6, బి12, విటమిన్​–బి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్​, నియాన్​, పీచు పదార్థాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చైనాకు చెందిన క్యాన్సర్​ డాక్టర్‌‌‌‌ లీపింగ్​ లియో చేసిన రీసెర్చ్‌‌లో క్యాన్సర్​ తగ్గించే పదార్థాలు బ్లాక్‌‌రైస్‌‌లో ఎక్కువగా ఉంటాయని తేలింది. ఈ బియ్యం గంజిని తల వెంట్రుకలకు పట్టిస్తే బలంగా, అందంగా మారతాయి. ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. మణిపూర్‌‌‌‌ సంప్రదాయ వైద్యంలో బ్లాక్​ రైస్​ను ఎక్కువగా వాడతారు. నల్ల బియ్యం కంటి సమస్యలను కూడా నయం చేస్తాయి” అని చెప్తున్నాడు అజిత్‌‌.

ఆదర్శ రైతు

అజిత్‌‌కుమార్​ కొత్త పంటలను సాగు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.  అజిత్‌‌ను చూసి పక్క గ్రామాలు పెద్దరాజుపేట, పోసాన్​పల్లిలో రైతులు కూడా ఈ పంట సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు ఇరవై మంది బ్లాక్‌‌ రైస్‌‌ సాగు మొదలుపెట్టారు. ఈ మధ్యే ‘తెలంగాణ గ్రామ భారతీ సంస్థ’ అజిత్‌‌కు ‘ప్రకృతి రైతు అవార్డు’ ఇచ్చింది. ఆసక్తి ఉన్న రైతులకు ఈ బ్లాక్‌‌ రైస్‌‌ సాగు నేర్పిస్తానంటున్నాడు అజిత్‌‌.

నల్ల బియ్యంలో బోలెడన్ని న్యూట్రియెంట్స్‌ ఉంటాయి. అంతేకాదు ఇవి పండించిన రైతులకు లాభాలు కూడా తెచ్చి పెడుతున్నాయి. క్యాన్సర్​, డయాబెటిస్​, కంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయనే ఈ బ్లాక్​ రైస్‌ని పండిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు
యువ రైతు అజిత్‌కుమార్.

::: చేర్యాల, వెలుగు

Latest Updates