మజ్లిస్​తోనే మెట్రో రైలొచ్చిందన్న అక్బరుద్దీన్ ఒవైసీ

    మెట్రో గురించి అసెంబ్లీలో మొదట మాట్లాడింది నేనే: అక్బర్​

హైదరాబాద్, వెలుగు: మజ్లిస్​ పోరాటం వల్లే  హైదరాబాద్​కు మెట్రో వచ్చిందని అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. హైదరాబాద్​లో మెట్రో రైలు నిర్మాణం చేయాలని వైఎస్​ హయాంలో అసెంబ్లీలో తానే తొలిసారిగా మాట్లాడినట్లు చెప్పారు. హైదరాబాద్​కు మెట్రో వచ్చినా ఓల్డ్​ సిటీకి రాలేదని, ఓల్డ్​ సిటీపై ప్రభుత్వం శీత కన్నేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఎంఎంటీఎస్​ ఫేజ్​ –2 కూడా విస్తరిస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ అది కూడా రాలేదన్నారు. బుధవారం అసెంబ్లీలో అక్బరుద్దీన్​ మాట్లాడుతూ.. అప్పట్లో హైదరాబాద్​కు​మెట్రో రైలు కావాలని తాను అడిగితే, కాంగ్రెస్​ ఎమ్మెల్యే పీజేఆర్​ మోనో రైలు కావాలని అడిగేవారని, దీంతో అంతా కన్ఫ్యూజన్​కు గురయ్యేవారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఓల్డ్​ సిటీ మెట్రో రైల్​ అలైన్​మెంట్​లో 93 ప్రార్థన మందిరాలు ఉండడం వల్ల ఆ అలైన్‌‌మెంట్​ను మార్చాలని తాము కోరినట్లు చెప్పారు. మెట్రోను తాము వ్యతిరేకించడం లేదన్నారు. మెట్రోను ఓల్డ్​ సిటీకి విస్తరించేందుకు ఇన్నాళ్లు మూసీ ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్​ రావాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం దాటవేసిందని, మరి చాదర్‌‌ఘాట్‌‌ నుంచి మూసీ నది మీదుగా వెళ్లిన మెట్రో లైన్​కు ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్​ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తాము అడిగితే క్లియరెన్స్​లు అడ్డు వస్తున్నాయని, మీరు చేస్తే అడ్డు రాదా అని నిలదీశారు.

Latest Updates