గాంధీ హాస్పిటల్ కంటే జైలే నయం

హైదరాబాద్‌‌, వెలుగు : ‘గాంధీ హాస్పిటల్‌‌కు వెళ్లడం కన్నా జైలుకెళ్లడం మంచిదని జనం అంటున్నారు. అక్కడ తిండి సరిగా లేదు. మందులివ్వరు. సఫాయి ఉండదు. బాత్రూంలు నీట్‌‌గా ఉండవు. అందుకే జనం అక్కడికి పోవాలంటే భయపడుతున్నరు. దగ్గర్లోనే ఉన్న సెక్రటేరియెట్‌‌ ఖాళీగానే ఉంది. దాన్నెందుకు కరోనా హాస్పిటల్‌‌గా మార్చరు?  అందులో క్వారెంటైన్‌‌ సెంటర్‌‌ ఎందుకు పెట్టరు? ’ అని మజ్లిస్‌‌ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌ ఒవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్  నాంపల్లిలోని మజ్లిస్‌‌ ఆఫీస్​లో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ప్రభుత్వం కొన్ని విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటోందన్నారు. ‘వైరస్‌‌ సోకిందనే అనుమానంతో ఏడెనిమిది మందిని హాస్పిటల్‌‌కు తీసుకెళ్తరు. వాళ్లను ఒకే రూమ్​లో ఉంచి  శాంపిళ్లు తీసుకుంటరు. ఈ లోపు ఏడుగురికి  నెగెటివ్‌‌, ఒకరికి పాజిటివ్‌‌ వస్తుంది. అందర్నీ ఒకే చోట ఉంచడం వల్ల మిగతా వాళ్లకూ వైరస్‌‌ సోకుతుంది. ఇలాంటి విషయాల్ని పట్టించుకోవడం లేదు’ అని అన్నారు.  వైరస్‌‌ రాకుండా సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ పాటించాలని, ఒకరినొకరు కౌగిలించుకోవద్దని ప్రభుత్వం చెబుతోందని, మరి హాస్పిటల్​లో శుభ్రంగా లేకపోతే వైరస్‌‌ రాదా అని ప్రశ్నించారు. ప్రైవేట్​హాస్పిటల్స్ ను వెంటనే తెరిచి ఓపీని అందుబాటులోకి తేవాలన్నారు. రెంట్ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అక్బరుద్దీన్‌‌ తప్పుబట్టారు. ఇది ఓనర్లకు, కిరాయిదార్లకు గొడవ పెట్టడమేనని, కేవలం రెంట్​ మీద బతికే వారి గురించి కూడా ఆలోచన చేయాలన్నారు. ఈ విషయంలో అక్కడక్కడ కేసులు కూడా నమోదవుతున్నాయన్నారు. రంజాన్‌‌ నెలలో ముస్లింలు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని అక్బరుద్దీన్​ సూచించారు.

Latest Updates