యూట్యూబర్‌పై రూ. 500 కోట్ల పరువునష్టం దావా వేసిన అక్షయ్ కుమార్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ కేసులో తనపై తప్పుడు మరియు నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు బీహార్‌కు చెందిన ఓ యూట్యూబర్‌పై నటుడు అక్షయ్ కుమార్ పరువు నష్టం దావా వేశారు. తనకు పరువు నష్టం కలిగించే మరియు అవమానకరమైన వీడియోలను రషీద్ సిద్దిఖీ అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ ఎఫ్ఎఫ్ న్యూస్‌లో అప్‌లోడ్ చేసినందుకు అక్షయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా సదరు యూట్యూబర్ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కోరారు. అదేవిధంగా అతని యూట్యూబ్ ఛానల్ నుంచి అభ్యంతరకరమైన వీడియోలను కూడా తొలగించాలని కోరారు.

సుశాంత్ రాజ్‌పుత్ సింగ్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి కెనడా పారిపోవడానికి అక్షయ్ సాయం చేశాడని రషీద్ తన వీడియోలలో పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ కేసు గురించి మంత్రి ఆదిత్య ఠాక్రే మరియు ముంబై పోలీసు కమిషనర్‌తో రహస్య చర్చలు జరిపారని కూడా ఆరోపణలు చేశాడు.

‘ఈ వీడియోలు తప్పుడు వీడియోలు, నిరాధారమైనవి, మరియు పరువు నష్టం కలిగించేవి. ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా ప్రచురించబడ్డాయి. ఇది ఒక ప్రచార స్టంట్ మాత్రమే. ఈ వీడియోల వల్ల నా పరువుపోయింది. అందుకే సదరు యూట్యూబర్ పరువునష్టం కింద రూ. 500 కోట్లు చెల్లించాలి. బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆ వీడియోలన్నీ తొలగించాలి. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి క్లిప్‌లను అప్‌లోడ్ చేయకూడదు’ అని అక్షయ్ తన నోటీసులో పేర్కొన్నాడు. మూడు రోజుల వ్యవధిలో రషీద్ సిద్దిఖీ ఈ నోటీసుపై స్పందించకపోతే అతనిపై చట్టపరమైన చర్యలను ప్రారంభిస్తామని అక్షయ్ తరఫు లాయర్ తెలిపారు.

కాగా.. రషీద్ అక్షయ్ పైనే కాకుండా ముంబై పోలీసులు మరియు మహారాష్ట్ర ప్రభుత్వం మీద కూడా పలు ఆరోపణలు చేశాడు. తమపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు రషీద్‌పై ముంబై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు.

For More News..

వ్యాను, ట్రక్కు ఢీ.. ఆరుగురు పిల్లలతో సహా 14 మంది మృతి

Latest Updates