మనం తెగ తాగుతున్నమట..

ఇండియన్స్ తెగ తాగేస్తున్నారట. 2010 నుంచి 2017 మధ్య 38 శాతం ఎక్కువగా మద్యం సేవించారని ది లాన్సెట్ జర్నల్ బుధవారం వెల్లడించింది. దీని వల్ల ప్రపంచ వాడకం 70 శాతం పెరిగిందని పేర్కొంది. 180 దేశాల్లో 1990 నుంచి 2017 వరకూ మద్యం వాడకంపై సర్వే చేసినట్లు తెలిపింది. 1990లో ప్రపంచంలో మద్యం వాడకం 20,999 మిలియన్ల లీటర్లుగా ఉండగా, 2017లో 35,676 మిలియన్ల లీటర్లకు పెరిగిందని చెప్పింది. ఈ లెక్కలు 2030 కల్లా మద్యం వాడకాన్ని తగ్గించాలన్న లక్ష్యంపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ఏడేళ్లలో మద్యం సేవించే ఓ ఇండియన్ ఏటా 5.9 లీటర్ల ఆల్కహాల్ తీసుకున్నారని లాన్సెట్ తెలిపింది. అమెరికా, చైనాల్లో కూడా మద్యం వాడకం పెరిగిందట. అమెరికాలో సగటు వాడకం 9.8 లీటర్లుగా, చైనాలో 7.4గా ఉంది. పేద, మధ్య ఆదాయ దేశాలు ఆల్కహాల్ ను తక్కువగా వాడుతున్నాయని చెప్పింది. 2030 కల్లా ప్రపంచంలోని సగం యువత మద్యం తీసుకుంటుందని అంచనా వేసింది. వీళ్లలో 23 శాతం మంది కనీసం నెలకు ఒక్కసారైనా ఆల్కహాల్ తీసుకుంటారని చెప్పింది.

ఆల్కహాల్ తో 200 జబ్బులు
మనుషులకు దాదాపు 200 జబ్బులు రావడానికి కారణం ఆల్కహాలేనని లాన్సెట్ పేర్కొంది. 1990 కంటే ముందు యూరప్ దేశాల్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వారని చెప్పింది. ఇప్పుడు ప్రపంచంలో ఆదాయం ఎక్కువగా వస్తున్న ప్రతీ దేశంలోనూ ఆల్కహాల్ వాడకం పెరిగిందని తెలిపింది. 2030 తర్వాత యూరప్ ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటున్న ఖండాల్లో ఉండదని వివరించింది. 2017లో ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలు అతి తక్కువగా ఆల్కహాల్ ను వాడాయని, సెంట్రల్, తూర్పు యూరోపియన్ దేశాలు అత్యధికంగా మద్యాన్ని తీసుకున్నాయని వెల్లడించింది. మల్డోవా దేశంలో ఏటా సగటున ఓ వ్యక్తి 15 లీటర్ల ఆల్కహాల్ తాగుతున్నాడట. కువైట్ లో అతి తక్కువగా 0.005 లీటర్లు తీసుకుంటున్నారని లాన్సెట్ చెప్పింది. మిగిలిన ఆఫ్రికా, అమెరికా, తూర్పు మధ్యదరా ప్రాంతాల్లో మద్యం వాడకంలో ఎలాంటి మార్పులు రాలేదని వివరించింది.

Latest Updates