దేశానికి కావాల్సింది చౌకీదార్ కాదు..కేసీఆర్ లాంటి జిమ్మేదార్ : కేటీఆర్

నల్గొండలో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెల్లని రూపాయి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండలో చెల్లని రూపాయి..భువనగిరిలో చెల్లుతుందా ? అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో  ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ ,ఎఐసిసి సభ్యుడు లక్ష్మణ్ రావు గౌడ్ కేటీఆర్  సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..‘ కోమటి రెడ్డి వెంకట రెడ్డి భువనగిరిలో పోటీ చేస్తున్నాడు. చెల్లని రూపాయి ఎక్కడయినా చెల్లని రూపాయే …కోమటి రెడ్డిని ఓడించి ఇంటికి సాగనంపడానికి ఇదే సరైన సమయం. కాంగ్రెస్ కు అభ్యర్థులు దొరక్క  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారిని పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులుగా దించింది. ఉత్తమ్ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్కు గుర్తు పుణ్యమా అని ఎమ్మెల్యే గా గెలిచారు. ఉత్తమ్ కు దమ్ముంటే హుజుర్ నగర్ ఎమ్మెల్యే గా రాజీనామా చేసి నల్లగొండలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలి. కాంగ్రెస్ లో పెద్ద పెద్ద నాయకులు నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినా  జిల్లాకు ఒరిగిందేమి లేదు. కెసిఆర్ లాగా 2 వేల కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా ?…యాదాద్రి గుడి ,గంధ మళ్ల రిజర్వాయర్ లతో ఆలేరు రూపు రేఖలు మారనున్నాయి .టీఆర్ఎస్ లో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నాం. అందరూ ఐకమత్యంతో పని చేసి ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాలి.  16 మంది టీఆర్ఎస్  ఎంపీలు గెలిస్తే వారికి 150 మంది తోడవుతారు.  కెసిఆర్ కొత్త కూటమి కట్టి ఢిల్లీలో ఏర్పడే ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు. దేశానికి కావాల్సింది చౌకీ దార్ కాదు ..కెసిఆర్ లాంటి జిమ్మేదార్ కావాలి‘ అని అన్నారు.

Latest Updates