AAPకు MLA గుడ్ బై.. ట్విట్టర్‌లో రిజైన్ లెటర్

ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు, ఢిల్లీలోని చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కాలాంబా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇపుడు .. ఖాస్ ఆద్మీ పార్టీగా మారిందంటూ ఆమె.. ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా  చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. ట్విట్టర్ లోనే రాజీనామా లేఖను పంపిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

“ఆమ్ ఆద్మీ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే టైమొచ్చింది. గడిచిన ఆరేళ్ల రాజకీయ ప్రయాణం నాకు ఎంతో నేర్పింది. అందరికీ ధన్యవాదాలు. అరవింద్ కేజ్రీవాల్ గారూ.. మీరు కోరినట్టుగా మీ అధికార ప్రతినిధి నానుంచి రాజీనామా అడిగారు. ట్విట్టర్ లో పంపుతున్న ఈ రాజీనామాను అంగీకరిస్తారని నమ్ముతున్నా. ఖాస్ ఆద్మీ పార్టీగా మారిన ఆమ్ అద్మీ పార్టీ .. నా ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తుందని ఆశిస్తున్నా” అంటూ వరుసట్వీట్లు చేశారు ఎమ్మెల్యే అల్కా లాంబా.

అల్కాలాంబా 20 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2013లో ఆప్ లో చేరారు. 2015లో ఎమ్మెల్యే అయ్యారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ సత్తా చాటలేకపోయిందనీ… అర్వింద్ కేజ్రీవాల్ జవాబు ఇవ్వాలని ఆమె బహిరంగంగా డిమాండ్ చేశారు. దీంతో.. ఆప్ ఎమ్మెల్యేలున్న వాట్సప్ గ్రూప్ నుంచి ఆమెను డిలీట్ చేయాల్సిందిగా సీఎం కేజ్రీవాల్ సూచించారు. అప్పటినుంచి పార్టీతో ఆమె అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని ఆ మధ్య ప్రకటించారు. గత మంగళవారం నాడు అల్కాలాంబా.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు. మళ్లీ తన మాతృ పార్టీలోకి చేరడానికి సిద్ధమయ్యారు. తాజాగా.. ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి  రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.