తెలంగాణ‌లో ఎంసెట్ స‌హా అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా

క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకీ తీవ్ర‌మ‌వుతున్న నేప‌థ్యంలో తెలంగాణలో ఎంసెట్ స‌హా అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా వేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జూలై మొద‌టి రెండు వారాల్లో జ‌ర‌గాల్సిన ఎంసెట్ స‌హా అన్ని కామ‌న్ ఎంట్రెన్స్ టెస్టుల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి.. హైకోర్టుకు తెలిపింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో మ‌రో 15 రోజుల పాటు మ‌ళ్లీ లాక్‌డౌన్ పెట్టాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తున్నట్లు ప్ర‌భుత్వం ఇటీవ‌ల చెప్పిన నేప‌థ్యంలో ప్ర‌వేశ ప‌రీక్ష‌లు వాయిదా వేయాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై ఈ రోజు ఉద‌యం విచార‌ణ చేపట్టిన ధ‌ర్మాస‌నం.. ప్ర‌భుత్వ వివ‌ర‌ణ కోరింది. హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన అడ్వొకేట్ జ‌న‌ర‌ల్.. గ్రేట‌ర్ ప‌రిధిలో లాక్‌డౌన్ ఉంటుందా లేదా అన్న విష‌యం కేబినెట్ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. ఒక‌టి రెండ్రోజుల్లో కేబినెట్ భేటీ జ‌రుగుతుంద‌న్నారు. అయితే ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌పై ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని చెప్పేందుకు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స‌మ‌యం కోరారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్న‌త విద్యా మండ‌లి కోర్టుకు తెలిపింది.

Latest Updates