కరోనాతో దేశాలు ఆగమాగం

కరోనా ముట్టడిలో 4 దేశాలు

ఇటలీలో ఒక్కరోజే 627 మంది మృతి

ఇటలీలో మరణ మృదంగం

చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని పిడికిట్లో పట్టేసింది. 183 దేశాలను చుట్టేసింది. పుట్టుకకు కారణమైన దేశంలో అది ఇప్పుడిప్పుడే చస్తున్నా, మిగతా దేశాల్లో మాత్రం జనాల్ని చంపేస్తోంది. ముఖ్యంగా ఇటలీ,
ఇరాన్​లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికాలో చిన్నగా మొదలై ఒక్కసారిగా పెనుతుఫానులా ముంచెత్తింది. స్పెయిన్​లో ‘పవర్​’ వైరస్​, కరోనా వైరస్​ చెలరేగడానికి కారణమైంది. ఆ దేశాల్లో పరిస్థితి ఎట్లుంది?

అందమైన సిటీలకు నెలవు ఇటలీ. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ఆ దేశం ఇప్పుడు కరోనా మరణాల్లో చైనాను దాటేసి, నంబర్​ వన్​ అయిపోయింది. కేసులు 47 వేలు దాటాయి. 4,032 మంది చనిపోయారు. చనిపోయినోళ్లను సొంతూళ్లలో ఖననం చేసే పరిస్థితి కూడా లేదు. అసలు శ్మశాన వాటికల్లో చోటే లేదు. అన్ని నిండిపోయాయి. కొన్ని చోట్ల అసలు అనుమతించట్లేదు. లొంబార్డి రీజియన్​లోని బెరగామో ప్రావిన్స్​లో ఇప్పుడు అదే పరిస్థితి. మిలటరీ వాహనాల్లో శవాలను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారు.

అమెరికాలో తెగ తిరిగేస్తున్నరు

కరోనాకు అగ్రరాజ్యం అమెరికా కూడా తలవంచాల్సిన పరిస్థితి వచ్చేసింది. మొదట్లో కేసుల సంఖ్య రోజుకు ఒకటి.. రెండే! కానీ, ఆ తర్వాతే పరిస్థితి మారిపోయింది. మార్చి 16న కేసుల సంఖ్య కేవలం 4,503. కానీ, ఇప్పటికి కేసులు 16,489కి చేరిపోయాయి. అంటే వైరస్​ ఎంత వేగంగా దేశంలో పాకుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటిదాకా 223 మంది చనిపోయారు. మరణాలు తక్కువే అయినా, కేసులు ఎక్కువవుతున్న వేగమే ఆందోళన కలిగిస్తున్న విషయం. దీంతో,  అమెరికాలో లాక్​డౌన్లు మొదలయ్యాయి.

ఇరాన్​లో పెడబొబ్బలు

ఇరాన్​లో పర్షియన్​ న్యూఇయర్​ నౌరూజ్​ మొదలు కాబోతోంది. వాళ్లకు పండుగ అది. కానీ, ఇలాంటి టైంలోనే జనాలు పెడబొబ్బలు పెట్టాల్సిన పరిస్థితి. చైనా, ఇటలీ తర్వాత మరణాల్లో అదే టాప్​. డాక్టర్లు రెండు వారాలుగా ఇంటికెళ్లకుండా పేషెంట్లకు ట్రీట్​మెంట్​ చేస్తున్నారు. అయితే సరైన మాస్క్​లు అవీ లేక పేషెంట్ల నుంచి వైరస్​ సోకి డాక్టర్లు, నర్సులూ నేలరాలుతున్నారు. అంతేకాదు, దేశంలో చావులు, కేసులు ఎక్కువగానే ఉన్నా, అసలు సంఖ్యను దాచేసి తప్పుడు లెక్కలు చెబుతోందని డాక్టర్లు అంటున్నరు.

స్పెయిన్​లో ‘పవర్​’ వైరస్​

ప్రస్తుతం యూరప్​లో ఇటలీ తర్వాత ఎక్కువగా ఎఫెక్ట్​ అయిన దేశం స్పెయిన్​. ఓవరాల్​గా ఎక్కువ కేసులు నమోదైన మూడో దేశం.  ఆ దేశానికి ‘అధికారం’ అనే మరో వైరస్​, కరోనా వైరస్​ విజృంభణకు కారణమైంది.  ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఏం చేయాలో పాలుపోక ప్రధాని పెడ్రో శాంచెజ్​ తల పట్టుకున్నారు. ఇలాంటి టైంలో లాక్​డౌన్​ విధిస్తే ప్రభుత్వం కూలడం ఖాయమని భావించారు. జనాలను ఫ్రీగా తిరగనిచ్చారు. దీంతో వైరస్​ విపరీతంగా వ్యాపిస్తోంది.

ఇటలీ.. అందమైన సిటీలకు పెట్టింది పేరు. జలజలా పారే కాల్వలు, ఆ కాల్వల్లో మనుసును హాయిగొలిపే ప్రయాణాల వెనిస్​.. రాజుల కాలంలో ఎన్నెన్నో సభలకు నిలయమైన కలోజియం ఉన్న రోమ్​.. ఫ్యాషన్​కు మారుపేరైన మిలాన్​.. ప్రపంచ అద్భుతం లీనింగ్​ టవర్​ను తనలో దాచుకున్న పీసా వంటి సిటీలు ఆ దేశంలోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటే పోతే అక్కడి సిటీల గురించి ఇంకా ఇంకా మాట్లాడుకోవచ్చు. కానీ, ఇప్పటి పరిస్థితి వేరు. అందమైన ఆ దేశం కాస్తా కరోనా వల్లకాడులా మారుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, రోజూ వేలాది కేసులు, వందలాది మరణాలతో అది అల్లకల్లోలం అవుతోంది. దేశం మొత్తం అదే పరిస్థితి. ముందే స్పందించకపోవడం, చెప్పిన మాట జనాలు వినకపోవడం వంటి కారణాలే అక్కడ ఈ పరిస్థితికి కారణం.

సొంతూళ్లో అంత్యక్రియలకు నో

ఎంత దారుణంగా ఉందంటే, చనిపోయిన వారిని కనీసం సొంతూళ్లో ఖననం చేయలేని పరిస్థితి. అయినోళ్లను దగ్గర్నుంచి పలకరించలేని దుస్థితి. ఇటలీలో కరోనాకు మూల కేంద్రం లొంబార్డి రీజియన్​. దేశంలో నమోదైన కేసుల్లో సగం అక్కడివే. ఆ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్​ అయింది బెరగామో ప్రావిన్సే. చనిపోయిన కరోనా బాధితులను సంప్రదాయబద్ధంగా సొంతూళ్లలో ఖననం చేయలేని పరిస్థితులు ఉండడంతో ఆ శవాలను వేరే ప్రాంతానికి తీసుకెళుతున్నారు. అందుకు ఆర్మీ సాయం తీసుకోవాల్సిన దుస్థితి కుటుంబ సభ్యులది. 65 శవాలను తీసుకుని మిలటరీ ట్రక్కులు బారులు తీరుతున్న ఘటనలూ ఉన్నాయి. వుహాన్​ తర్వాత అంత సీరియస్​ పరిస్థితులున్నది ఇటలీలోనేనని బెరగామోలోని ప్రధాన ఆస్పత్రి అయిన పోప్​ జాన్​23 ఇంటెన్సివ్​ కేర్​ యూనిట్​ హెడ్​ డాక్టర్​ ల్యూకా లోరిని అన్నారు. అయితే, దేశంలో వైరస్​ ఎంటరవ్వగానే చాలా మంది అదో జస్ట్​ ఫ్లూ మాత్రమే అనుకున్నారని నిపుణులు అంటున్నారు. అయితే, ముందు నుంచీ అది జస్ట్​ ఫ్లూ కాదు అని హెచ్చరించారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. పట్టించుకునే సరికి పరిస్థితి చెయ్యి దాటిపోయింది. ఒకటి.. పది.. వంద.. వేలు.. ఇదీ కేసుల పరిస్థితి. ముందు చావులు తక్కువే, కానీ, ఆ తర్వాతే ఆస్పత్రులు మొత్తం నిండిపోవడంతో ట్రీట్​మెంట్​ చేయలేని పరిస్థితుల్లో చాలా మంది వైరస్​కు బలయ్యారు.

99% మందికి వేరే జబ్బులు

చనిపోయిన వాళ్లలో 99 శాతం మంది ముసలోళ్లు, వేరే జబ్బులున్నోళ్లేనని ఇటలీ నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ అధికారులు చెబుతున్నారు. 48.5 శాతం మందికి 3 లేదా 4 జబ్బులున్నట్టు తేల్చారు. 25.6 శాతం మందికి రెండు, 25.1 శాతం మంది కనీసం ఒక్క జబ్బుతో బాధపడుతున్నట్టు నిర్ధారించారు. ఎక్కువ మందికి హైబీపీ, గుండెజబ్బులు, షుగర్​ వంటివి ఉన్నట్టు తేల్చారు. చనిపోయిన వాళ్లలో 76.1 శాతం మందికి హైబీపీ ఉందన్నారు. 35.5 శాతం మందికి షుగర్​, 33 శాతం మందికి గుండెజబ్బులున్నట్టు గుర్తించారు. డాక్టర్లూ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. వైరస్​ సోకినోళ్లను కాపాడదామని ఎంత ప్రయత్నించినా ఫలించట్లేదు. పనిచేసినా వైరస్​ తమకు అంటకుండా పేషెంట్ల తలలకు ట్రాన్స్​పరెంట్​ ఎయిర్​టైట్​ హెల్మెట్లు పెట్టి ట్రీట్​మెంట్​ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Latest Updates