డీసీసీబీ చైర్మన్​లన్నీ టీఆర్ఎస్ ఖాతాలోనే

డీసీసీబీ, డీసీఎంఎస్ డైరెక్టర్లు ఏకగ్రీవం

పలుచోట్ల రిజర్వేషన్​ స్థానాల్లో అభ్యర్థులు లేక ఖాళీ

అన్ని చైర్మన్​ పదవులూ  టీఆర్ఎస్ ఖాతాలోనే

హైకమాండ్​ పరిశీలనకు ఆశావహుల పేర్లు

రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లు, తొమ్మిది జిల్లా కో-ఆపరేటీవ్‌ మార్కెటింగ్‌ సొసైటీ  (డీసీఎంఎస్‌)ల్లో డైరెక్టర్ల స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. ఇందులో మెజారిటీ పదవులు టీఆర్‌ఎస్‌ నేతలకే  దక్కాయి. డీసీసీబీలకు 20 మంది చొప్పున, డీసీఎంఎస్‌లకు 10 మంది చొప్పున డైరెక్టర్లను ఎన్నుకునేందుకు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం1 గంట వరకు నామినేషన్లు స్వీకరించారు.  మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విత్​డ్రాకు అవకాశం కల్పించారు. కొన్ని రిజర్వేషన్​ స్థానాలు మినహా దాదాపు ఏకగ్రీవమయ్యాయి. కొన్నిచోట్ల రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో​ ఖాళీగా మిగిలాయి.

వెలుగు, నెట్​వర్క్​: అన్ని జిల్లాల్లో డీసీసీబీ, డీసీఎంఎస్​ చైర్మన్​ పదవులు టీఆర్ఎస్​ ఖాతాలో పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు మంగళవారం ఆయా జిల్లాల్లో అధికార పార్టీ తరఫున మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. ఉదయం నామినేషన్ల స్వీకరణ మొదలుకొని ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా అక్కడే ఉండి, వ్యవహారం చక్కదిద్దారు. ఏకగ్రీవాలకు తమవంతు ప్రయత్నాలు చేసి సక్సెస్​అయ్యారు. ఏకగ్రీవంగా గెలిచిన డైరెక్టర్లను అటు నుంచి అటే క్యాంపులకు తరలించారు. జిల్లాల నుంచి డీసీసీబీ, డీసీఎంఎస్​ చైర్మన్​ ఆశావహుల పేర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు హైకమాండ్​కు పంపించగా, ఈ నెల 29న అక్కడి నుంచి సీల్డ్​ కవర్​లో వచ్చే పేర్లను అధికారికంగా అదే రోజు ప్రకటించనున్నారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ లకు సింగిల్ నామినేషన్లు దాఖలవడంతో అన్ని డైరెక్టర్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున డైరక్టర్ పదవులు కేటాయించారు. నామినేషన్లు రాక డీసీసీబీలో 5 డీసీఎంఎస్​లో 3 డైరెక్టర్ పోస్టులు మిగిలిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాకు కు చెందిన జక్కా రఘునందన్ రెడ్డి, అదే జిల్లాకు చెందిన పోకల మనోహర్, నారాయణపేట జిల్లా కు చెందిన నిజాంపాషా తదితరులు చైర్మన్​ రేసులో ఉన్నారు.

నల్గొండ డీసీసీబీ, డీసీఎంఎస్‌ డైరెక్టర్లంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీసీసీబీలో 20, డీసీఎంఎస్‌లో 10 స్థానాలకు మంగళవారం నల్గొండలో అధికారులు నామినేషన్లు స్వీకరించారు. రిజర్వేషన్ల కారణంగా డీసీసీబీలో మూడు పదవులకు అభ్యర్థులు లేకపోవడంతో 17 పోస్టులకే ఎన్నికలు నిర్వహించారు. అధికార పార్టీ నేతల మధ్య పంపకాలతో పాటు కాంగ్రెస్‌ పార్టీతో ముందుగానే ఒప్పందం జరిగిపోవడంతో ఏ స్థానానికి కూడా పోటీ లేకుండా పోయింది. దీంతో అన్ని స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. ఓసీలకు డీసీసీబీ, బీసీలకు డీసీఎంఎస్​ ఇచ్చే చాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

ఉమ్మడి మెదక్​ జిల్లా డీసీసీబీ, డీసీఎంఎస్​ డైరెక్టర్​ స్థానాలను అధికార  టీఆర్ఎస్​ ఏకగ్రీవంగా దక్కించుకుంది.  డీసీసీబీలో 20  స్థానాలకు18  , డీసీఎంఎస్​లో 10 స్థానాల్లో ఎనిమిదింటికి   సింగిల్​ నామినేషన్లు దాఖలు కావడంతో ఆయా డైరెక్టర్​ పోస్టులు టీఆర్ఎస్​నేతలకే ఏకగ్రీవమయ్యాయి. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్​ చైర్మన్​ పదవులను కూడా ఆ పార్టీ లీడర్లే దక్కించుకోనున్నారు.  డీసీసీబీ చైర్మన్​ పదవికి  మెదక్​ ఎమ్మెల్యే పద్మ భర్త ఎం.దేవేందర్​రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్​ చిట్టి దేవేందర్​రెడ్డి, సినీ  నిర్మాత మల్కాపూర్​ శివకుమార్​, బక్కి వెంకటయ్య, అంజిరెడ్డి పోటీ పడుతున్నారు. ఝరాసంగం మండలం ఏడాకులపల్లి సొసైటీ చైర్మన్​ శివకుమార్​  డీసీఎంఎస్​ చైర్మన్​ రేసులో ఉన్నారు.

ఆదిలాబాద్​ జిల్లాలో నిన్నటిదాకా పంతం పట్టిన నేతలు మంగళవారం ఒక అంగీకారానికి వచ్చారు. మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై పదవులను పంచుకున్నారు. డీసీసీబీ చైర్మన్‌ పదవి ఆదిలాబాద్‌కు, వైస్‌చైర్మన్‌ పదవి నిర్మల్‌కు,  డీసీఎంఎస్ చైర్మన్​ పదవి మంచిర్యాల జిల్లాకు, వైస్‌ చైర్మన్‌ ఆసిఫాబాద్ జిల్లాకు ఇవ్వాలని నిర్ణయం తీసుతీసుకున్నారు. ఈ మేరకు ఎవరికి పదవులు దక్కాలో వారి పేర్లను కూడా నిర్ణయించారు.  ఈ నిర్ణయాన్ని హైకమాండ్‌కు నివేదించారు. కాగా, ఆదిలాబాద్​ డీసీసీబీలో 20 డైరెక్టర్​ స్థానాలకు గాను 17 మంది డైరెక్టర్​ పోస్టులు ఏకగ్రీవమయ్యాయి.  డీసీఎంఎస్ కు సంబంధించి మొత్తం పది డైరెక్టర్​ పోస్టులు
ఏకగ్రీవమయ్యాయి.

నిజామాబాద్ జిల్లాలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో అన్ని స్థానాలను టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. డీసీసీబీ  ఎన్నికలకు సంబంధించి గ్రూపు ‘ఏ’ లోని 16  స్థానాలకుగాను 15 స్థానాలకు సింగిల్ నామినేషన్లు వచ్చాయి. ఎస్సీ డైరెక్టర్​పోస్టుకు నామినేషన్ దాఖలు కాలేదు. గ్రూపు ‘బి’లోని నాలుగు స్థానాలకు 9 మంది నామినేషన్లు వేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి చొరవ తీసుకుని రెబెల్ అభ్యర్థులను విత్ డ్రా చేయించారు. ఆ నలుగురు డైరెక్టర్లు కూడా ఏకగ్రీవమయ్యారు. డీసీఎంఎస్ లోని పది స్థానాలకు కూడా సింగిల్ నామినేషన్లు దాఖలు కావడంతో ఏకగ్రీవాలయ్యాయి.  బీ గ్రూపు డైరెక్టర్​ పోస్టులను ఏకగ్రీవం చేయించేందుకు మంత్రి ప్రశాంత్​రెడ్డి నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. రెబెల్​ అభ్యర్థులు గడువు దాటిన 50 నిమిషాల తర్వాత  వచ్చినా విత్​డ్రా చేసుకునేందుకు అనుమతించడం విమర్శలకు కారణమైంది.

ఖమ్మం జిల్లా డీసీసీబీలో 20 డైరెక్టర్లకు గాను 16 మంది, డీసీఎంఎస్ లో 10 డైరెక్టర్లకు గాను 8 మంది ఏకగ్రీవమయ్యారు.  క్లాస్ ఏ విభాగంలో డీసీసీబీలో ఎస్టీకి 3, ఎస్సీకి 1, డీసీఎంఎస్ లో ఎస్టీకి 1, ఎస్సీ 1 రిజర్వు కాగా, ఒక్క నామినేషన్ కూడా రాకపోవడంతో ఖాళీగానే ఉన్నాయి. ఉదయం నామినేషన్ల దాఖలు ప్రారంభమైనప్పటి నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  డీసీసీబీ దగ్గరే ఉండి చక్రం తిప్పారు. అనంతరం గెలిచిన డైరెక్టర్లను క్యాంప్‌నకు తరలించారు.

రంగారెడ్డి జిల్లా పరిధిలో డీసీసీబీ డైరెక్టర్​ స్థానాలకు14మంది, మార్క్ ఫెడ్ డైరెక్టర్​ స్థానాలకు ఏడుగురు నామినేషన్లు వేయగా అన్నీ
ఏకగ్రీవమయ్యాయి.

కరీంనగర్​లో సింగిల్​ నామినేషన్లు

కరీంనగర్​ జిల్లా కేంద్రసహకార బ్యాంకు చైర్మన్​గా కొండూరి రవీందర్​రావు ఎన్నిక లాంఛనం కానుంది. డీసీసీబీ డైరెక్టర్లు ఏకగ్రీవం కావడంతో మంత్రి గంగుల కమలాకర్​ సమక్షంలో  చైర్మన్​ ఎన్నికపై ఏకాభిప్రాయానికి వచ్చారు. వైస్​ చైర్మన్​గా పింగిలి రమేశ్​ పేరు ఖరారు చేశారు. మంగళవారం పీఏసీఎస్ సంఘాల చైర్మన్లతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన మంత్రి.. చైర్మన్, వైస్​ చైర్మన్లతో పాటు ఎవరెవరు డైరెక్టర్లుగా నామినేషన్లు వేయాలో డిక్లేర్ చేశారు. దీంతో డీసీసీబీ, డీసీఎంఎస్ లకు అన్ని స్థానాలకు సింగిల్​నామినేషన్లే వచ్చాయి. రిజర్వేషన్లు అనుకూలించక డీసీసీబీ లో 5, డీసీఎంఎస్ రెండు స్థానాలకు నామినేషన్లు రాలేదు.

చక్రం తిప్పిన ఎర్రబెల్లి

వరంగల్ డీసీసీబీ, డీసీఎంఎస్​ డైరెక్టర్​ పోస్టులన్నీ ఏకగ్రీవమయ్యాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హన్మకొండ హరిత హోటల్లో మకాం వేసి చక్రం తిప్పారు. డైరెక్టర్ పోస్టుకు నామినేషన్ వేయడానికి వచ్చిన ఒకరిద్దరికి  నచ్చజెప్పి బరిలోకి దిగకుండా అడ్డుకున్నారు. ఏకగ్రీవమయ్యేలా చూశారు. తన ప్రధాన అనుచరుడు మార్నేని రవీందర్రావును డీసీసీబీ చైర్మన్ చేయాలని భావిస్తున్న మంత్రి..  డైరెక్టర్లను క్యాంపునకు తరలించారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్​ మంత్రితో ఉన్నారు.

For More News..

హాస్టల్ బాత్రూంలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

శ్రీదేవి లాంటి వాళ్లకే తప్పలేదు

టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు

ఓయూలో రేపు జాబ్​ మేళా

Latest Updates