ఆ రైలు పరుగుల వెనుక ‘‘పింక్ గ్యాంగ్’’

వ్యవసాయం దగ్గరనుంచీ విమానాలు నడపడం దాకా ఆడపిల్లలు దాదాపు అన్ని పనులూ చేసేస్తున్నారు. మహిళల సంఖ్య తక్కువగా కనిపించేది మెకానికల్ రంగంలోనే. ఇక రైల్వేలో మెకానిక్ పని చేయడం అంటే?? అంత కష్టమైన పని ఆడవాళ్లు చెయ్యగలుగుతారా? అనుకోవటానికి ముందు ఒకసారి ‘‘పింక్ గ్యాంగ్’’ గురించి తెలుసుకోవాల్సిందే…

కేరళలోని తిరువనంతపురం రైల్వేస్టేషన్‌‌లోని ‘ఆల్‌‌ ఉమెన్‌‌ మెకానిక్‌‌ టీం’నే ‘పింక్ గ్యాంగ్’ అంటున్నారు. ఇక్కడ ‘వాంచినాడ్ ఎక్స్‌‌ప్రెస్ రైల్’ మెయింటెనెన్స్ మొత్తం ఆడవాళ్ల చేతిలోనే ఉంది. కోచ్ బోల్ట్స్ బిగించటం దగ్గరనుంచీ, ఇంజిన్లో ఉండే టెక్నికల్ సమస్యలని సాల్వ్ చేసేదాకా అన్ని పనులూ అవలీలగా చేసేస్తారు వీళ్లు. నిజానికి రైల్వే కోచ్ రిపేరింగ్ సెక్షన్ అనగానే టూల్స్ దగ్గరనుంచీ స్పేర్ పార్ట్స్ వరకూ అన్నీ బరువైనవే ఉంటాయి. అయినా సరే వెనకడుగు వేసేది లేదు అంటూ ఆ ఎక్స్ ప్రెస్ ని పరుగులు తీయిస్తున్నారు ఈ పద్దెనిమిది మంది లేడీస్ టీమ్. ఈ టీమ్‌‌నే తిరువనంతపురం రైల్వే డిపార్ట్ మెంట్ ‘పింక్‌‌ గ్యాంగ్‌‌’ అని పిలుచుకుంటున్నారు. ఈ టీమ్‌‌లో ఒక సీనియర్‌‌ ఇంజినీర్‌‌, తొమ్మిది మంది జూనియర్‌‌ టెక్నీషియన్లు,   ఎనిమిది మంది హెల్పర్లు ఉన్నారు. ఈ టీమ్ సీనియర్ సూపర్ వైజర్ ‘సబియా బివి’ దాదాపు రిటైర్ మెంట్ వయసులో కూడా ఇక్కడే పని చేస్తున్నారు. వి.ఎం.శ్రీకళ 35 ఏళ్ల వయసులోనే జూనియర్ ఇంజినీర్‌‌‌‌గా పని చేస్తోంది.

స్టాఫ్ అంతా గ్రాడ్యుయేట్లే

ఈ టీంలో  జూనియర్ ఇంజినీర్ శ్రీకళ (బీ.టెక్) తప్ప మిగతా అందరూ గ్రూప్–D కేటగిరీలో జాయిన్ అయిన వాళ్లే. మామూలుగా అయితే గ్రూప్–D కేటగిరీకి పదో తరగతి పూర్తయితే సరిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం స్టాఫ్ అంతా గ్రాడ్యుయేట్లే. ఈ మొత్తం గ్రూప్ లో ఎం.ఏ.,  ఎం.కామ్ లాంటి మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్లు ఏడుగురున్నారు. మిగతా వాళ్లు బ్యాచిలర్ డిగ్రీలు చేశారు. 2017లో సీ.సీ. జాయ్ అనే సీనియర్ డివిజినల్ మెకానికల్ ఇంజినీర్  ఈ టీంని తయారు చేశాడు. జూనియర్ ఇంజినీర్‌‌‌‌ శ్రీకళని హెడ్‌‌గా నియమించి ఆమెతో ఈ పింక్ గ్యాంగ్‌‌ని తయారు చేశారు. ఈ జాబ్‌‌లో చేరేముందు మూడు నెలలు “ట్రిప్‌‌ షెడ్యూల్” ట్రైనింగ్ ఇచ్చారు.

పని పూర్తయ్యాకే …

వర్షం పడుతున్నా, ఎండ ఉన్నా పని మాత్రం ఆగేది లేదు. పింక్ గ్యాంగ్ వర్క్ లోకి దిగిందీ అంటే వాంచినాడ్ ఎక్స్ ప్రెస్ రన్నింగ్ రేస్ మొదలు పెట్టాల్సిందే. మూడేళ్లుగా వాంచినాడ్ ట్రైన్ ని కంటికి రెప్పలా చూసుకుంటోంది పింక్ గ్యాంగ్. వీళ్ల డ్యూటీ టైమింగ్స్ పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ. కానీ టైం అయిపోయినా సరే మొదలు పెట్టిన పని పూర్తయ్యాకే డ్యూటీ నుంచి దిగుతారు. అండర్ గేర్‌‌‌‌ చెక్  చేయటం. ఎయిర్ బ్రేక్ మెయింటెనెన్స్ ఇలాంటివి కచ్చితంగా, చాలా జాగ్రత్తగా చేయాల్సిన పనులు. ట్రాక్ మీద చనిపోయే జంతువుల శరీర భాగాలు ఏయిర్ పైప్ నుంచి క్లీన్ చేయటం, రెండు బోగీలను లింక్ చేయటం లాంటి కష్టమైన పనుల్ని కూడా టీం వర్క్‌‌తో అవలీలగా చేసి పడేస్తున్నారు. 

విపరీతమైన ఒత్తిడిలోనూ…

ఇక వర్క్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ ఉండకూడదు. కాళ్లకి బరువైన సేఫ్టీ షూ, తలకి హెల్మెట్ కంపల్సరీ గా ఉండాల్సిందే. ఎంతదూరం అయినా నడుస్తూ వెళ్లాల్సిందే. పని చేసేటప్పుడు నిలబడే చేయాలి. అంతే కాదు ఇంజిన్ నుంచి వచ్చే వేడిని తట్టుకోవాలి. ఇక గాయాలు సర్వసాధారణం. ఇవన్నీ చెబుతుంటేనే ఆ ఉద్యోగం ఎంత కష్టమో అర్థమవుతోంది కదా. బాడీ, మైండ్ రెండింటి మీదా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఇన్ని రకాల సవాళ్లకి ఏమాత్రం భయపడకుండా మూడున్నర సంవత్సరాలుగా వాళ్లు ఆ పని చేస్తున్నారు. ఇంత వరకూ వాళ్లు చేసిన పనిలో ఒక్క రిమార్క్ కూడా లేదు. ఏ ప్రమాదం జరగలేదు, వాళ్ల మెయింటెనెన్స్‌‌లో వాంచినాడ్ ఎక్స్‌‌ప్రెస్‌‌ పరుగులు తీస్తూనే ఉంది. ఇంత జాగ్రత్తగా పని చేసినందుకు 2019లో జాతీయ అవార్డ్ దక్కింది. ఈ గ్యాంగ్ ఇన్‌‌స్పిరేషన్‌‌తో ఇంకా కొన్ని ఇలాంటి పింక్ గ్యాంగ్‌‌లు తయారు కావాలని ఈ టీం మెంబర్స్ కోరుకుంటున్నారు. ఆడవాళ్లు ఫలానా పని చేయలేరనేది నిజం కాదని వాళ్లు నిరూపించాలనుకుంటున్నారు.

ఆ పనే ఒక ఛాలెంజ్

ఈ డ్యూటీ చెయ్యటం అంటే ఒకరకంగా ఛాలెంజ్. ఎందుకంటే 24 కోచ్‌‌లలో ప్రతీ బోగీకి ఉండే ప్రతీ బోల్ట్, గేర్, బ్రేక్ బోగీ లింక్ లను చెక్ చేసి వాటిని బిగించటం, మార్చటం చేయాల్సి ఉంటుంది. బ్రేక్ వైర్లను ఏమాత్రం తేడా రాకుండా బలంగా బిగించాలి. ఇవన్నీ అంత ఈజీ కాదు. చాలా ఓపిక, స్కిల్, బలం కావాలి. ఈ పనికి ఒక కచ్చితమైన టైమింగ్ ఉండదు. ప్రతిరోజూ ఏ షిఫ్ట్ అయినా సరే పని చేయాల్సిందే. వీటితో పాటు ఇంజిన్ రిపేర్లు మెయింటెనెన్స్ కూడా పింక్ గ్యాంగ్ పనే. అన్నిటికన్నా కష్టమైన పని దాదాపు 50 కేజీల వరకూ బరువుండే టూల్ బాక్స్‌‌ని మోసుకు వెళ్లటం. ఎవరి టూల్‌‌ బాక్స్‌‌ వాళ్లే మోసుకుపోవాలి.  ఎవరూ సాయం రారు.

Read More News….

ఆక్సిజన్ ట్రీట్ మెంట్ తో వయసు​ తగ్గించొచ్చట

వెరైటీ వెడ్డింగ్ కార్డు: మట్టిలో పెడితే పూలు, కూరగాయల మొక్కలు మొలకెత్తుతాయి

ఈ మాస్క్ ధర రూ. 7 లక్షలు.. ఎందుకో తెలుసా?

Latest Updates