ఓటు హక్కు లేని నాయకులంతా హైదరాబాద్ విడిచి వెళ్లాలి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి

హైదరాబాద్: ఎన్నికలు జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓటు హక్కు లేని రాజకీయ నాయకులు, ప్రచార కార్యకర్తలు అందరూ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుండి బయటకు వెళ్లాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచార సమయం ముగిసిన వెంటనే ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పోలింగ్ విధివిధానాలను మరోసారి మీడియా ద్వారా ప్రజలకు వివరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ రోజు  పోటీ చేసే అభ్యర్థి ఒక్క  వాహనానికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి ఎల్లుండి డిసెంబర్ 1వ తేది పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు  బంద్ చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ప్రజలు అందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల కమిషనర్ పార్థసారథి కోరారు.

22 వేల 272 కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 74 లక్షల 67 వేల 256 మంది ఓటర్లు ఉండగా.. వారిలో పురుష ఓటర్లు 38 లక్షల 89 వేల 637 మంది.. మహిళా ఓటర్లు 35 లక్షల 76 వేల 941 మంది ఉన్నారని ఈసీ పార్థసారథి వివరించారు. మొత్తం 9 వేల 101 కేంద్రాల్లో పోలింగ్ జరగనుండగా… 22 వేల 272 కేంద్రాల్లో లైవ్ వెబ్ క్యాస్టింగ్ కు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

 

 

Latest Updates