90 క్షణాల్లోనే పూర్తైన బాలాకోట్​ ఆపరేషన్

90 క్షణాల్లోనే పూర్తైన బాలాకోట్​ ఆపరేషన్
  • టెర్రరిస్ట్​ క్యాంప్​లను తుడిచిపెట్టాం
  • బాలాకోట్​ ఆపరేషన్​పై పైలెట్లు
  • చివరి క్షణం వరకూ సీక్రెసీ పాటించాం
  • అర్ధరాత్రి దాటాక మిరాజ్ ఫైటర్లతో గాల్లోకి..

ఆపరేషన్​ బందర్. బాలాకోట్​ ఎయిర్​స్ట్రయిక్స్​కు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ పెట్టిన కోడ్​ నేమ్. బోర్డర్​ దాటి వెళ్లి జైషే మహ్మద్​ టెర్రరిస్టు సంస్థ క్యాంపులను కూల్చివేయడం ఈ మిషన్​ టార్గెట్. ఈ ఆపరేషన్​కు పట్టిన టైమ్​ ఎంతో తెలుసా?​ 90 సెకన్లు. బాలాకోట్​లో ఐఏఎఫ్​ దాడి తొంభై క్షణాల్లో పూర్తయిందట. పుల్వామా టెర్రర్​ అటాక్​కు ప్రతీకారంగా చివరి క్షణం వరకూ సీక్రెట్ గా నడిచిన ఈ మిషన్​.. ఎలాంటి అనుమానాలకూ చోటివ్వకుండా ఫినిష్​ అయ్యిందట. పేర్లను బయటపెట్టొద్దనే షరతుతో బాలాకోట్​ ఎయిర్ ​స్ట్రయిక్స్​లో పాల్గొన్న పైలట్లు ఈ వివరాలను మీడియాకు మంగళవారం వెల్లడించారు.

న్యూఢిల్లీ: బాలాకోట్ లోని జైషే మహ్మద్ ​టెర్రర్​క్యాంపులపై జరిపిన ఇండియన్​ఎయిర్​ఫోర్స్​దాడి మొత్తం తొంభై క్షణాల్లో పూర్తయిందని ఈ ఆపరేషన్​లో పాల్గొన్న పైలెట్లు వెల్లడించారు. చివరి క్షణం వరకూ అత్యంత సీక్రెట్ గా, ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా మిషన్​పూర్తి చేసినట్లు చెప్పారు. తమ పేరు బయటపెట్టొద్దనే షరతుతో బాలాకోట్​ఎయిర్​స్ట్రైక్స్​వివరాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ ఆపరేషన్​పకడ్బందీగా కొనసాగించినట్లు చెప్పారు. వేర్వేరు ఎయిర్ బేస్​ల నుంచి బయలుదేరిన మన యుద్ధ విమానాలు చుట్టూ తిరిగి పాక్​బోర్డర్​దాటి బాలాకోట్​వైపు దూసుకెళ్లడం, ముందే ఫిక్స్​చేసిన టార్గెట్​పై బాంబులు వేసి వెనక్కి తిరిగి వచ్చేయడం అంతా క్షణాల్లో జరిగిపోయిందన్నారు.

ఆ రోజు ఏం జరిగిందంటే..

పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్​పై ప్రతీకారం తప్పదని అందరికీ అర్థమైంది.. అయితే, ఏం జరగనుందనే విషయంలో ఎవరికీ క్లారిటీలేదు. ఎయిర్​ఫోర్స్​కార్యకలాపాలు రొటీన్​గా జరిగిపోతున్నాయ్. ఉన్నతాధికారుల రొటీన్ డ్యూటీల్లోనూ ఎలాంటి మార్పులేదు. బోర్డర్​లో గస్తీని అధికారులు పెంచారు. మిరాజ్​జెట్లతో మేం కూడా గస్తీలో పాల్గొన్నాం. ఫిబ్రవరి 25 సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో బేస్ స్టేషన్లో మిరాజ్​ఫైటర్లకు స్పైస్​2000 మిస్సైల్స్​అమర్చారు. వాటిలో టార్గెట్​అప్పటికే ఫీడ్​చేశారు. అప్పటికీ దాడి చేయాల్సిన ప్రదేశానికి సంబంధించిన వివరాలను మాకు పూర్తిగా చెప్పలేదు. అర్ధరాత్రి దాటింది.. ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో మేం గాల్లోకి లేచాం.. మాకు రక్షణగా సుఖోయ్‌‌‌‌-30 ఎంకేఐ విమానాలు, గైడెన్స్​కోసం అవాక్స్‌‌‌‌ విమానం, అవసరమైతే గాల్లోనే ఫ్యూయెల్ నింపేందుకు మరో ట్యాంకర్‌‌‌‌ విమానం కూడా మాతో వచ్చాయి.

టార్గెట్ ​వివరాలతో పాటు, ఏ రూట్లో ప్రయాణించాలి, ఎలా వెనక్కి రావాలనే విషయాలను ఉన్నతాధికారులు మాకు వివరంగా చెప్పారు. నిర్దేశించిన రూట్​లో మా ప్రయాణం సాగింది. ఈలోగా పాక్​బోర్డర్​లో గస్తీ ఫైటర్ల సంఖ్యను మరింత పెంచారు. పాక్ ఎయిర్​ఢిఫెన్స్​ను గందరగోళంలోకి నెట్టడమే వాటి ఉద్దేశం.. సడెన్​గా గస్తీ పెరగడంతో ఏదో జరగబోతోందని శత్రువు అనుమానిస్తాడు కానీ అదేంటనేది తెలియక అయోమయంలో పడతాడు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో బోర్డర్​దాటి పని పూర్తిచేసుకురావాలని ప్లాన్.. అంతా అనుకున్నట్లుగానే జరిగింది.

సుదీర్ఘ రూట్​ను ఎంచుకుని ప్రయాణించి, పాక్​బోర్డర్​దాటి బాలాకోట్​జైషే క్యాంపుపై మిస్సైల్స్​వదిలాం. పాక్​తేరుకునేలోగా వెనక్కి తిరిగొచ్చాం. టెర్రర్​క్యాంపు నామరూపాల్లేకుండా పోయింది. అయితే, ఈ దాడిలో కొన్ని చెట్లు తప్ప ఎలాంటి నష్టం జరగలేదని పాక్​వాదించింది. ఈ ఆపరేషన్ మొత్తం రహస్యంగా జరిగింది. నేను ఇందులో పాల్గొంటున్నట్లు నా భార్యకు కూడా తెలియదు. తెల్లారి మీడియాలో చూసి ఇందులో మీరు పాల్గొన్నారా అని అడిగితే.. నేను జవాబివ్వకుండా నిద్రపోయాను.