బీసీ రిజర్వేషన్లు తగ్గించొద్దు

  • రాష్ట్రంలో పేరుకే మంత్రులు
  • ప్రజా సమస్యలు పట్టని సర్కార్​
  • అఖిల పక్ష భేటీలో కోదండరాం
  • సీఎంకు చిత్తశుద్ధి లేదు: దత్తాత్రేయ
  • బీసీ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర: జీవన్​రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు: మున్సిపల్​ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించొద్దని, యథాతథంగా కొనసాగించాలని టీజేఎస్‌‌ చీఫ్​ ప్రొఫెసర్‌‌ కోదండరాం డిమాండ్​ చేశారు.  స్థానిక ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పిస్తేనే భవిష్యత్‌‌లో నాయకులుగా ఎదుగుతారని, ఆ సోయే లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పేరుకే మంత్రులున్నారని, నిర్ణయాలు తీసుకునే అధికారం వాళ్లకు లేదని విమర్శించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌‌క్లబ్‌‌లో బీసీ సంక్షేమ సంఘం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కోదండరాం మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కమిషన్‌‌కు నిధులివ్వడం లేదని, లక్షల మంది రుణాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధి కింద ఇచ్చిన నిధులు కూడా ఖర్చవడం లేదన్నారు. ప్రజా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని, ఇండస్ట్రియల్‌‌ కారిడార్‌‌ పేరుతో గ్రేటర్‌‌ సిటీ చుట్టూ ఉన్న ఎస్సీ, ఎస్టీల భూములను గుంజుకుంటున్నదని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ ఐక్యపోరాటాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రాచరిక పాలన: దత్తాత్రేయ

రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, బీసీ రిజర్వేషన్లు తగ్గించే అధికారం కేసీఆర్‌‌కు ఎవరిచ్చారని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌‌ నేత బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. సీఎంకు బీసీలపై చిత్తశుద్ధిలేదని, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

అందరం ఏకమవుదాం: ఆర్​.కృష్ణయ్య

పంచాయతీ, మున్సిపల్‌‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 24 శాతానికి తగ్గించడం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌. కృష్ణయ్య ప్రశ్నించారు.  2014 ఎన్నికలకు ముందు బీసీలకు 45 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌‌ ఉన్న రిజర్వేషన్లలోనే కోత పెట్టారని ఆయన దుయ్యబట్టారు. రిజర్వేషన్లు రాజ్యాంగపరమైన హక్కు అని, బీసీలు కులవృత్తులే చేయాలి కాని ఉద్యోగాలు, పదవులు చేపట్టవద్దా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అందరూ ఏకమై రిజర్వేషన్లు సాధించుకోవడానికి పోరాడాలని పిలుపునిచ్చారు.  సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఆర్టికల్ 370ను రద్దు చేసిన విధంగానే, వివిధ రాష్ట్రాల్లో ఉన్న బీసీలను ఏకం చేసే విధంగా ఒక నిర్ణయాన్ని తీస్కొని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఉద్యోగాలు ఏమాయె?: జీవన్​రెడ్డి

మహారాష్ట్రలో ప్రస్తుతం 52 శాతం రిజర్వేషన్లు ఉండగా, మరాఠాలకు అదనంగా 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు అనుమతిచ్చిందని, కానీ కేసీఆర్‌‌ మాత్రం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేకనే ఉన్నవాటిని తగ్గించారని కాంగ్రెస్‌‌ నేత, ఎమ్మెల్సీ టి. జీవన్‌‌రెడ్డి మండిపడ్డారు.  రాష్ట్రంలో 1.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన సీఎం ఇప్పటి వరకు 30 వేల ఉద్యోగాలను కూడా భర్తీ చేయలేదన్నారు. క్రమేణ బీసీ రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కేసీఆర్‌‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

Latest Updates