తెలంగాణలో స్కూళ్లు, థియేటర్లు, బార్లు బంద్: కేసీఆర్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లు మూసేయాలని నిర్ణయించింది. జన సాంద్రత ఎక్కువగా ఉండే  ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా తిరగకపోవడం మంచిదని కేబినెట్ సూచించింది. ఈ కేబినెట్ సమావేశం చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియాకు వివరించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు  ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ప్రాథమికంగా కేబినెట్ రూ.500 కోట్లు మంజూరు చేసింది. చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉంది. ఏ సమయంలోనైనా వాడుకోవచ్చు. ఎయిర్ పోర్టులో 200 మంది డాక్టర్లు, అధికారులు ఉండి స్క్రీనింగ్ చేస్తున్నారు. విదేశాల నుంచి వస్తున్న వారి నుంచి వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఒక హైదరాబాద్‌లోనే మనకు విమానాశ్రయం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు.

దుబాయ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా వచ్చి గాంధీలో చికిత్స అందించగా.. పూర్తిగా తగ్గిపోయిందని చెప్పారు కేసీఆర్. అతడిని గాంధీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా చేసినట్లు తెలిపారు. మరో రెండు కేసుల్లో అనుమానం ఉండడంతో పుణేకి శాంపిల్స్ పంపామన్నారు. మన దేశంలో భయపడే పరిస్థితి లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిందేమీ లేదన్నారు. ‘దేశం మొత్తంలో 83 మందికి వస్తే ఇద్దరు మాత్రమే మరణించారు. 10 మంది కోలుకున్నారు. ప్రస్తుతం భయపడాల్సిన పరిస్థితి లేదు. ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్తే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంది అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. కేబినెట్‌లో చర్చించి ఈ నిర్ణయానికి వచ్చాం’ అని చెప్పారు కేసీఆర్.

కీలక నిర్ణయాలివే

 • ఈ రాత్రి నుంచి మార్చి 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు (ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు), కోచింగ్ సెంటర్లు మూసివేత.
  పరీక్షలు అన్ని యధాతథంగా కొనసాగుతాయి.
 • ప్రభుత్వ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్‌లో ఉండే పిల్లలకు పరీక్షలు పూర్తయ్యే వరకు ఇబ్బంది లేకుండా కొనసాగిస్తాం.
 • పెళ్లిళ్లు, ఫంక్షన్ హాల్స్ మూసేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే నిర్ణయమైన పెళ్లిళ్లు చేసుకోవచ్చు. 200 మంది దాటకుండా ఆ శుభకార్యాలు జరుపుకోవాలి.
 • మార్చి 31 తర్వాత జరిగే పెళ్లిళ్లకు బుకింగ్ ఇవ్వకూడదని ఆదేశాలు.
 • బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, ఉత్సవాలు, ఊరేగింపులు , ర్యాలీలు పెట్టుకోకూడదు. అనుమతలు ఇవ్వబోం.
 • ఇండోర్, అవుట్ డోర్ స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్, అమ్యూజ్మెంట్ పార్కులు మూసేయాల్సిందే. ఎవరైనా ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటాం. అన్ని  స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు.
 • ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యదాతథంగా నడుస్తాయి.
 • సినిమా థియేటర్లు, వైన్స్. బార్లు, క్లబ్స్ అన్నీ బంద్.
 • సూపర్ మార్కెట్లు, షాపులు, మాల్స్ కొనసాగుతాయి. అక్కడ కూడా ఎక్కువ సేపు ఉండకుండా వెళ్లిపోవడం మేలు.
 • దేవాలయాలు, చర్చ్,మసీదు లు శుభ్రంగా ఉంటాయి కాబట్టి ఏమి కాదు.
 • సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాం.
 • మీడియాపైనా నియంత్రణ ఉంటుంది. కరోనాకు సంబంధించి హెల్త్ మినిస్ట్రీ ఇస్తే తప్ప ఇతర వార్తలను వేయొద్దని హెచ్చరిక. కాదని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. భయోత్పాతం కలిగించొద్దు.
 • మంచిర్యాల, జగిత్యాల లో ఎక్కడ కూడా కరోనా కేస్ లు గుర్తించలేదు.
 • ఆరోగ్య శాఖ గుర్తించిన కేస్ లని మాత్రమే వార్తలు వేయాలి.
 • ప్రెస్ హక్కులను మేము హరించడం లేదు. ప్రజలకు అవగాహన కల్పించే విదంగా మీడియా వ్యహరించాలి.
 • మాస్కు లు, సానిటేషన్ లు ఎక్కువ ధరలకు అమ్మితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

అన్ని ఏర్పాటు చేశాం

 • అనుకోని పరిస్థితులు తలెత్తే చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 1020 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి
 • 321 ఐసీయూ బెడ్స్ కూడా రెడీ పెట్టాం
 • 240 వెంటిలేటర్స్ సిద్ధంగా ఉంచాం
 • క్వారంటైన్ ఆస్పత్రులు రాష్ట్రంలో నాలుగు పెట్టాం.
 • ఆరోగ్య శాఖ, పంచాయతీ, మునిసిపల్, ఫారెస్టు, పోలీసు డిపార్ట్ మెంట్స్ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
 • టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు పరిస్థితిపై  సమీక్షించి ఆరోగ్య శాఖ మంత్రి కి రిపోర్ట్ చేస్తుంది.

Latest Updates