డల్లాస్ ముచ్చట ఖల్లాస్!..సీఎం హామీలన్నీ మూలకు

  •     కలగానే జేబీఎస్–తూంకుంట స్కైవే నిర్మాణం
  •     బడ్జెట్ లేక ఆగిన ఎయిర్ పోర్టు– మెట్రో కనెక్టివిటీ
  •     చాలా స్కై వేలు, ఎక్స్​ప్రెస్​ వేలకు ఇంకా అనుమతులే ఇయ్యలె
  •     ఓల్డ్​ సిటీని ఇస్తాంబుల్​లా తీర్చిదిద్దుతమన్నరు
  •     ఇప్పటికీ అడుగు కూడా ముందుకు పడలె

హైదరాబాద్, వెలుగు:  స్కై స్క్రాపర్స్​.. చుట్టూ పచ్చని అడవులు, వేగంగా దూసుకుపోయే స్కై వేలు.. శాటిలైట్​ టౌన్​షిప్పులు.. వరల్డ్ క్లాస్ మౌలిక వసతులంటూ హైదరాబాద్​ కోసం చెప్పిన ప్లాన్డ్ సిటీ ముచ్చట్లన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. డల్లాస్  సిటీ తరహాలో తీర్చిదిద్దుతామని, ఓల్డ్ సిటీకి ఇస్తాంబుల్ మెరుగులద్దుతామంటూ సీఎం కేసీఆర్ చెప్పిన మాటలకు ఆరేండ్లు నిండుతున్నా.. ఇప్పటికీ ఎలాంటి మార్పు జరగలేదు. నాలుగు వందల ఏండ్ల చరిత్ర.. కోటిన్నర జనాభా ఉన్న  హైదరాబాద్​ అభివృద్ధి కోసం ఇచ్చిన హామీలన్నీ అటకెక్కాయి.

డల్లాస్​ సిటీతో పోలికలున్నా…

యునైటెడ్ స్టేట్స్ లో భాగంగా ఉన్న డల్లాస్  సిటీకి, నిజాం నాటి హైదరాబాద్​కు పోలికలు ఉన్నాయి. సముద్రానికి దూరంగా, పీఠభూమిలో భాగంగానే ఈ రెండు సిటీలు ఉన్నాయి. 990 చ. కిలోమీటర్ల  విస్తీర్ణంలో ఉన్న డల్లాస్ సిటీలో రోడ్, ట్రైన్, ఎయిర్ వేస్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. కానీ సీఎం కేసీఆర్ ప్రకటన చేయక ముందే హైదరాబాద్ నగరం కాంక్రీట్ జంగిల్ గా మారింది. అయితే డల్లాస్ అంటేనే గుర్తుకువచ్చే స్కై స్క్రాపర్స్​ (టవర్స్), స్కై వేలు, మల్టీపుల్ ట్రాన్స్ పోర్టు, ఐకానిక్ భవనాలు, ఆహ్లాదకరమైన పార్కులు అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా ఉంటాయి.

స్కై స్క్రాపర్స్ రాలె

హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశాన్నంటే టవర్స్  నిర్మిస్తామంటూ సీఎం కేసీఆర్​ ఇచ్చిన హామీ కలగానే మిగిలింది. ట్రాఫిక్ రహిత, వేగంగా దూసుకుపోయే రోడ్లు, సిగ్నల్ ఫ్రీ జంక్షన్లను రెండేండ్లలో అందుబాటులోకి తీసుకొస్తామని ఆరేండ్ల కింద చెప్పిన హామీలూ అమలు కాలేదు.  స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ లోని స్కైవేలు, ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ దశలోనే ఉండగా.. ఏండ్లుగా ఊరిస్తున్న జేబీఎస్ – తూంకుంట ఎక్స్ ప్రెస్ వేకు కనీసం భూసేకరణ పూర్తి చేయలేకపోయారు. హైదరాబాద్​ నుంచి నేరుగా వరంగల్ వెళ్లేందుకు వీలుగా ఉప్పల్ – నారాపల్లి మధ్య ఎక్స్ ప్రెస్​ వే నిర్మాణ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. గోల్నాక – రామాంతాపూర్ ఫ్లైఓవర్ పనులు ఇంకా మొదలు కాలేదు. గడిచిన నాలుగేండ్లలో ఎల్బీనగర్, చింతల్ కుంట, సఫిల్ గూడ, రహేజా మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, ఆరాంఘర్ జంక్షన్ మినహా మరో 8 ఎక్స్ ప్రెస్ వేల పనులు స్టార్ట్​ కాలేదు.

స్కైవే, ఎక్స్ ప్రెస్ వేలకు అనుమతి రాలె

స్కై వేలు, ఎక్స్ ప్రెస్ వేలు, అండర్ పాస్ బ్రిడ్జిలను ప్రభుత్వం అభివృద్ధి చిహ్నాలుగా చెప్పుకోగా.. ఇప్పటికీ సిటీ వ్యాప్తంగా వాటి పనులన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. ఇందుకోసం దాదాపు రూ. 23వేల కోట్లతో ఎస్ఆర్డీపీలో భాగంగా 54 జంక్షన్లలో అండర్ పాస్, ఫ్లై ఓవర్, స్కైవేలు, ఎక్స్ ప్రెస్ వేల నిర్మాణం చేపడితే.. ఇందులో మూడేండ్ల కింద మొదలుపెట్టిన బాలానగర్ ఎక్స్ ప్రెస్  వే పనులు ఇప్పటికీ భూసేకరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒవైసీ హాస్పిటల్ , బహదూర్ పుర ఫ్లైఓవర్, అంబర్‌‌పేట్‌‌ ఛే నెంబర్‌‌ ఫ్లైఓవర్‌‌ ఇంకా మొదలు కాకపోగా..  ఖాజాగూడ టన్నెల్‌‌, ఎలివేటెడ్‌‌ కారిడార్‌‌, ఉప్పల్‌‌ క్రాస్‌‌రోడ్‌‌ ఫ్లైఓవర్లు ఇప్పటికీ పాలన పరమైన అనుమతులు రాలేదు. కేవలం ఐదేండ్ల కింద జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో  పెట్టుకునే ఫ్లైఓవర్ల పేరిట ప్రభుత్వం హడావుడి చేసిందే తప్ప.. జనాల అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడంలేదని  ఎక్స్​పర్ట్స్​ విమర్శిస్తూనే ఉన్నారు.

ఎయిర్ పోర్టు వరకు మెట్రో ఎప్పుడు?

డల్లాస్ నగరం చుట్టూ 6 విమానాశ్రయాలు ఉండగా, ప్రతి ఎయిర్​పోర్టుకు వేగంగా చేరుకునేలా ఎక్స్ ప్రెస్ వే, లోకల్ ట్రైన్ తో నగరం  నుంచి 15 నిమిషాల్లోపే ఎయిర్ పోర్టుకు చేరుకునేలా రవాణా సౌలతులున్నాయి. కానీ హైదరాబాద్ సిటీకి ఉన్న ఒకే ఒక్క అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే మినహా మరోటి లేదు. అయితే ఐదేండ్ల కింద జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా ఎయిర్ పోర్టు వరకు మెట్రో, ఎంఎంటీఎస్  వరకు పొడిగిస్తామని చేసిన ప్రతిపాదనలు ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఆరు నెలల కింద రాయదుర్గం వరకు మెట్రో అందుబాటులోకి రాగా.. ఎయిర్ పోర్టు వరకు మెట్రో విస్తరణకు నిధుల్లేక అక్కడితో ఆగిపోయింది.

‘ఇస్తాంబుల్’లా చేసేదెన్నడు?

ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తామని, ఇస్తాంబుల్​లా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఐదేండ్ల కింద ప్రకటించింది. కానీ అడుగు కూడా ముందుకు పడలేదు. ఇరుకైన రోడ్లు, చెత్తతో నిండిన మురికివాడలు, డ్రైనేజీలను తలపించే బస్తీలు కనిపిస్తున్నాయి. రాజసౌధాలు, వారసత్వ సంపదగా ఉన్న మసీదులు, కట్టడాలను 150కి పైగా గుర్తించిన ఇస్తాంబుల్ ప్రభుత్వం.. వాటిని రక్షించేందుకు ప్రత్యేక నిధులను కేటాయించింది. కానీ మన నగరంలో 200కు పైగా ఉన్న కట్టడాలు, కోటలు, మసీదులు, దేవాలయాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం  గాలికొదిలేసిందన్న విమర్శలు ఉన్నాయి.

ప్లాన్డ్ సిటీ ప్రకటనల్లోనే

ఎడ్యుకేషన్​, హెల్త్​, మౌలిక వసతులను అభివృద్ధి చేసినప్పుడే హైదరాబాద్​కు గ్లోబల్ సిటీ రూపు రేఖలు వస్తాయి. ఇప్పటికీ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు నిజాం కాలం నాటి హాస్పిటల్స్ తప్ప… కొత్తగా ప్రభుత్వం ఎన్ని హాస్పిటళ్లను నిర్మించిందో చెప్పాలి. ప్రణాళికబద్ధమైన కార్యాచరణ, ప్రభుత్వ యంత్రాంగంలో చిత్తశుద్ధితో డల్లాస్ తరహా నగరం సాధ్యమైతుంది.. కానీ ప్రకటనలతో కాదు. ప్లాన్డ్ సిటీ అంటూ ఊదరగొట్టే ప్రసంగాలతో  ప్రజల జీవన ప్రమాణాలు ఎప్పటికీ మెరుగుపడవు.

– అనురాధ రెడ్డి, ఇంటెక్ కో కన్వీనర్

Latest Updates