‘నేమ్​ అండ్​ షేమ్’ బోర్డులు తీసేయండి: అలహాబాద్​ హైకోర్టు

  • యోగి సర్కారుకు అలహాబాద్​ హైకోర్టు ఆదేశం

యాంటీ సీఏఏ ఆందోళనకారుల ఫొటోలు, పేర్లతో ‘నేమ్​ అండ్​ షేమ్’ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని అలహాబాద్​ హైకోర్టు తప్పుబట్టింది. ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించడమేనని, బోర్డులను ఏర్పాటుచేసే అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పింది. ఆ బోర్డులను వెంటనే తొలగించాలని లక్నో అడ్మినిస్ట్రేషన్​ అధికారులను ఆదేశించింది. ఈమేరకు చీఫ్​ జస్టిస్​ జస్టిస్​ గోవింద్​ మాథుర్, జస్టిస్​ రమేశ్​ సిన్హాలతో కూడిన బెంచ్​సోమవారం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలతో ఈ నెల 16 లోగా రిపోర్టు ఇవ్వాలని లక్నో కలెక్టర్​తో పాటు సీపీకి ఆదేశాలు జారీ చేసింది.

ఏం జరిగింది..?

గతేడాది డిసెంబర్​లో లక్నోలో జరిగిన యాంటీ సీఏఏ ఆందోళనల్లో నిరసనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ ఆందోళనల వల్ల ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిరసనకారుల నుంచే వసూలు చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ప్రకటించారు. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఆందోళనల వీడియోలను, సీసీకెమెరా ఫుటేజ్​ల సాయంతో నిరసనకారులను గుర్తించే పక్రియను మొదలెట్టారు. ఇలా గుర్తించిన వారి ఫొటోతో పాటుపేరు, అడ్రస్‌‌‌‌లతో అధికారులు లక్నో ప్రధాన వీధుల్లో హోర్డింగ్​లు ఏర్పాటు చేశారు. ఇది కాస్తా సంచలనం సృష్టించింది. దీనివల్ల నిరసనకారులపై మూకదాడులు జరిగే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో దీనిపై అలహాబాద్​ హైకోర్టులో పిల్​ దాఖలైంది.

స్వాగతించిన ప్రతిపక్షాలు

హైకోర్టు ఉత్తర్వులను ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు స్వాగతించాయి. సిటిజన్స్ ప్రైవసీ హక్కు గురించికానీ, రాజ్యాంగం పట్ల గౌరవంగానీ యూపీ ప్రభుత్వానికి లేవని, యోగి ప్రభుత్వంలో ప్రజలు విసుగుచెందుతున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. నిరసనల్లో పాల్గొన్న వారి హోర్డింగ్స్ ను తొలగించాలన్ని కోర్టు తీర్పును బీఎస్పీ స్వాగతిస్తోందని ఆ పార్టీ చీఫ్​ మాయావతి ట్వీట్ చేశారు. కోర్టు నిర్ణయం ఆదిత్యనాథ్ ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక వైఖరిని బయటపెట్టిందని కాంగ్రెస్ యూపీ చీఫ్​ అయజ్ కుమార్ అన్నారు.

Latest Updates