ఉల్లి ఐడియాతో ఇంటికి..ముంబై నుంచి అలహాబాద్ కు ఓ వ్యక్తి జర్నీ

అలహాబాద్‌లాక్ డౌన్ తో చాలామంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ముఖ్యంగా ముంబైలో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ కు చెందిన ప్రేమ్ మూర్తి పాండే ముంబైలోని ఎయిర్ పోర్టులో పని చేస్తూ అంధేరీ ఈస్ట్ లోని ఆజాద్ నగర్ లో నివసిస్తున్నాడు. ఫస్ట్ ఫేజ్ లాక్ డౌన్ అయిపోగానే ఇంటికి పోదామని అనుకున్న పాండేకు నిరాశే ఎదురైంది. మరోవైపు ఆజాద్ నగర్ లో ఇరుకైన గల్లీలో ఎక్కువ మంది నివసిస్తున్నారు. అక్కడ కరోనా సోకితే చాలా ప్రమాదమని పాండే భయపడిపోయాడు. ఎలాగైనా ఇంటికి పోవాలని నిర్ణయించుకున్నాడు.  ప్రభుత్వం లాక్ డౌన్ నుంచి వేటికి సడలింపులు ఇచ్చిందని తెలుసుకున్నాడు.

వయా నాసిక్… 

ప్రేమ్ మూర్తి పాండే ముందుగా ముంబైలోని ఓ పండ్ల వ్యాపారితో ఒప్పందం చేసుకున్నాడు. నాసిక్ దగ్గర్లోని పింపల్ గావ్ మార్కెట్ నుంచి వాటర్ మిలన్స్ పంపిస్తానని చెప్పి, ఏప్రిల్ 17న ఓ మినీ ట్రక్కును అద్దెకు తీసుకొని వెళ్లాడు. 1,300 కిలోల వాటర్ మిలన్స్ లోడ్ ను పంపించి ప్రేమ్ అక్కడే ఉండిపోయాడు. అక్కడి నుంచి అలహాబాద్ ఎలా వెళ్లాలా? అని ఆలోచించగా ‘ఉల్లి’పాయం తట్టింది. మార్కెట్ లో 25,520 కిలోల ఉల్లిగడ్డలు కొన్నాడు. వీటికి మొత్తం రూ.2,32,232 ఖర్చయింది. తర్వాత రూ.77,550 లకు ఓ ట్రక్కును మాట్లాడుకొని ఉల్లిగడ్డలు లోడ్ చేసి ఇంటిని పయనమయ్యాడు. మూడ్రోజుల్లో 1200 కి.మీ. ప్రయాణించి ఏప్రిల్ 20న అలహాబాద్ కు చేరుకున్నాడు. పాండే గురించి తెలుసుకున్న పోలీసులు అతనికి టెస్టులు చేసి, సెల్ఫ్​క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

Latest Updates