రైతులకు పైసలెట్ల ఇస్తరు?:హైకోర్టు

హైదరాబాద్​, వెలుగు: చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయన్న కారణంతో షుగర్​ ఫ్యాక్టరీల్లోని నిల్వల అమ్మకాలపై ఆంక్షలు పెడితే రైతులకు కంపెనీలు బకాయిలు ఎలా చెల్లిస్తాయని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. బకాయిల చెల్లింపుకు అవసరమైన మేరకైనా కంపెనీలకు చక్కెర అమ్ముకునే వీలు కల్పించాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖను జస్టిస్​ రాజశేఖర్​రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్​కు చెందిన ట్రైడెంట్​ షుగర్స్​ లిమిటెడ్​ కంపెనీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఆయన విచారించారు. ‘‘పిటిషనర్​ దగ్గర రెండు లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలున్నాయి. నెలకు రెండు శాతమే అమ్ముకునేలా కేంద్రం నిబంధన పెట్టింది. దీంతో ఏడాదిలో సగం కూడా అమ్మలేం. కేంద్రం నిబంధన వల్ల రైతులకు డబ్బు చెల్లిపులూ ఆగిపోతున్నాయి” అని పిటిషనర్​ వాదించారు. ఉత్పత్తి పెరిగి ధర పడిపోతున్నందుకే కేంద్రం ఈ నిబంధన పెట్టిందని అసిస్టెంట్​ సొలిసిటర్​ జనరల్​ కే లక్ష్మణ్​ వివరించారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర హైకోర్టుల్లో నమోదైన ఏడు కేసులను సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్రం కోరనుందని చెప్పారు. విచారణ రెండు వారాలకు వాయిదా పడింది.

 

 

Latest Updates