బిగ్​ బజార్​ అమెజాన్​ చేతికి!

న్యూఢిల్లీ: రిటైలింగ్‌‌ సెగ్మెంట్లో మనదేశంలోనే నంబర్‌‌ 2 కంపెనీ అయిన ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో వాటా కొనడానికి ఈ–కామర్స్‌‌ కంపెనీ అమెజాన్‌‌ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఇందుకోసం ఈ రెండు కంపెనీలు జరుపుతున్న చర్చలు తుదిదశలో ఉన్నట్టు తెలిసింది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఇండియా రిటైల్‌‌ మార్కెట్‌‌లో స్థానం సంపాదించుకోవడానికి అమెజాన్‌‌ ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో 10 శాతం తీసుకోనుంది. ఇందుకోసం ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ రూ.రెండు వేల కోట్ల వాల్యుయేషన్ అడుగుతోందని సంబంధిత ఆఫీసర్లు కొందరు వెల్లడించారు. హోల్డింగ్‌‌ కంపెనీ ద్వారా ఒప్పందం జరుగుతుందని, ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ ఫౌండర్‌‌, చైర్మన్‌‌ కిషోర్‌‌ బియానీ నుంచి మరిన్ని షేర్లు కొనేందుకు అమెజాన్‌‌కు అవకాశం ఇస్తారని అన్నారు.  ముంబైకి చెందిన ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ బిగ్‌‌బజార్‌‌ పేరుతో సూపర్‌‌ బజార్‌‌ సహా పలు వ్యాపారాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో వాటా దక్కడం వల్ల అమెజాన్‌‌ రిటైలింగ్‌‌ రంగానికి కూడా విస్తరించవచ్చు. అమెరికాలోని భారీ రిటైల్‌‌ చైన్‌‌ హోల్‌‌ ఫుడ్స్ మార్కెట్‌‌ను అమెజాన్‌‌ 2017లో కొనడం ద్వారా ఫుడ్ రిటైలింగ్‌‌ విభాగంపై పట్టుదక్కించుకుంది. కూరగాయలు, పాల వంటి వాటిని హోండెలివరీ విధానంలోనే కొనేందుకు నగరవాసులు ఆసక్తి చూపుతుండడంతో అమెజాన్‌‌ ఫ్యూచర్‌‌ రిటైల్‌‌లో వాటాపై దృష్టి పెట్టింది. చర్చలు తుదిదశకు వచ్చినప్పటికీ ఒప్పందం మాత్రం ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. ఈ విషయమై మాట్లాడటానికి అటు ఫ్యూచర్‌‌ రిటైల్‌‌ ఆఫీసర్లు గానీ, అమెజాన్ ప్రతినిధులు గానీ ఇష్టపడలేదు.

పోటీకి సిద్ధం…

ఇండియా రిటైల్ మార్కెట్‌‌ను సొమ్ము చేసుకోవడానికి అమెరికా కంపెనీ వాల్‌‌మార్ట్‌‌ ఇది వరకే ఇక్కడ స్టోర్లు తెరిచింది. ఇండియాలోనే అత్యంత ధనికుడు ముకేశ్‌‌ అంబానీ కూడా త్వరలో ఈ–కామర్స్‌‌లోకి రాబోతున్నారు. వాల్‌‌మార్ట్‌‌ సైతం గత ఏడాది ఫ్లిప్‌‌కార్ట్‌‌లో 70 శాతానికిపైగా వాటాను కొన్నది. రిలయన్స్‌‌, వాల్‌‌మార్ట్‌‌ వంటి పెద్ద కంపెనీల నుంచి పోటీని తట్టుకోవడానికి అమెజాన్‌‌ ఇది వరకే షాపర్స్‌‌ స్టాప్‌‌, మోర్‌‌ సూపర్‌‌మార్కెట్స్‌‌లో వాటాలు కొన్నది. మనదేశంలో రిటైల్‌‌ మార్కెట్‌‌ విలువ గత ఏడాది 79 బిలియన్ డాలర్లు కాగా, 2023 నాటికి ఇది 188 బిలియన్లకు చేరుతుందనే అంచనాల నేపథ్యంలో అమెజాన్‌‌ ఈరంగంలోకి రావాలని నిర్ణయించుకుంది. ఫ్యూచర్‌‌ రిటైల్‌‌కు దేశవ్యాప్తంగా 400 నగరాల్లో రెండువేల స్టోర్లు ఉన్నాయి. ఎఫ్‌‌బీబీ పేరుతో ఇది దుస్తుల వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది.

Latest Updates