ఆ పని చేసి బాబు ఆదర్శ నేత అనిపించుకోవాలి

  • అక్రమ ఇంటిని ఖాళీ చేయాలి: అంబటి రాంబాబు

తాడేపల్లి: 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా నిర్మించిన లింగమనేని గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు అక్రమ నిర్మాణం అని తెలిసి కూడా సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వెంటనే ఆ ఇంటి నుంచి మారి ఆదర్శమైన రాజకీయ నాయకుడిగా అనిపించుకోవాలని అన్నారు.

సుజనా కమల వనంలో పచ్చ పుష్పం

బీజేపీలో చేరిన సుజనా చౌదరి ఇంకా టీడీపీ నేతలానే మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అన్నారు. ఆయన కమల వనంలో ఉన్న పచ్చ పుష్పమన్నారు. రివర్స్ టెండరింగ్ లో వందల కోట్లు మిగిలిన సంగతి సుజనా చౌదరికి కనిపించడం లేదా అని అంబటి ప్రశ్నించారు.

అవినీతి రహిత పరిపాలన అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పరిపాలించిన చంద్రబాబు ప్రతి క్షణం జగన్ పై బురద చల్లే పనిలోనే ఉన్నారన్నారు. చంద్రబాబు విషం కక్కే కార్యక్రమంకు ఎల్లో మీడియా వంతపాడుతోందని, ఆయన పిల్లిలా అరిస్తే పులిలా గాండ్రించారంటూ మొదటి పేజీలో వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు.

దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులను అడ్డుకున్నట్లు, జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని అంబటి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతిని అరికట్టి ప్రజాధనాన్ని కాపాడేందుకు సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. రివర్స్ టెండరింగ్ అద్భుతమైన విజయం సాధించిందన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పొలవరంలో 780 కోట్ల ప్రజా ధనాన్ని సీఎం ఆదా చేశారన్నారు. సీఎం జగన్ గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేస్తుంటే  పేపర్ లీకేజీ అయ్యిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి మండిపడ్డారు.

Latest Updates