అంబేద్కర్ కు అవమానం : విగ్రహం ధ్వంసం

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతికి ముందు రోజు ఆయన విగ్రహానికి అవమానం జరిగింది. హైదరాబాద్ పంజాగుట్ట చౌరాస్తాలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పోలీసులు, GHMC సిబ్బంది ధ్వంసం చేశారు. అనుమతి లేదనీ.. తొలగిస్తున్నామంటూ విగ్రహాన్ని పగలగొట్టారు. ఆ విగ్రహం ముక్కలను జవహర్ నగర్ డంప్ యార్డ్ కు తరలించి చెత్త కుప్పలో పారేశారు. అధికారుల తీరుపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉండటంతో.. శనివారం తెల్లవారుజామున పంజా గుట్ట సెంట్రల్ చౌరస్తాలో దళిత సంఘాల వాళ్లు ఓ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో … ఘర్షణ జరిగింది. వైఎస్ విగ్రహం పక్కనే ఎవరికీ ఇబ్బంది లేకుండా అంబేద్కర్ విగ్రహం పెడుతుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని సంఘాల నేతలు ప్రశ్నించారు. ముందు పోలీసులు వెనక్కి తగ్గారు. విగ్రహాన్ని తొలగించబోమని పంజాగుట్ట సీఐ మోహన్ కుమార్ హామీ ఇవ్వడంతో దళిత నేతలు ఆందోళన విరమించారు. ఈ ఘటనలో 20 మందిని అరెస్టు చేసి షాయినాయత్ గంజ్ కు తరలించారు.

ఈ సంఘటన తర్వాత పొద్దున జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. విగ్రహం పెట్టడానికి అనుమతి లేదంటూ దిమ్మను పగలగొట్టి విగ్రహాన్ని తొలగించారు. విగ్రహాన్ని అలాగే తీసే ప్రయత్నం చేయకుండా ముక్కలుగా ధ్వంసం చేశారు. ఆ ముక్కలను వెహికల్ లో జవహర్ నగర్ డంప్ యార్డ్ కు తరలించారు. అక్కడ చెత్తకుప్పలో పారేశారు. దీంతో దళిత సంఘాల నేతలు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు. కనీస గౌరవం లేకుండా రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా అక్కడే విగ్రహానికి పాలాభిషేకం చేశారు నేతలు.

Latest Updates