అంబులెన్స్ ను ఢీకొట్టిన కారు: ఏడుగురి మృతి

అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు అతి వేగం.. ఏడుగురు ప్రాణాలను బలి తీసుకుంది. మరో నలుగురిని ప్రాణాపాయ స్థితిలోకి నెట్టేసింది. ఉత్తరప్రదేశ్ లోని యమునా ఎక్స్ ప్రెస్ వేలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పటికే ఓ ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాలను తరలిస్తున్న అంబులెన్సును కారు ఢీకొట్టింది.

ఓ ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాలు, వారి కుటుంబసభ్యులతో అంబులెన్స్ ఢిల్లీ నుంచి బిహార్ కు వెళ్తోంది. యూపీలోని యమునా ఎక్స్ ప్రెస్ వేపై బల్దేవ్ ప్రాంతంలో డివైడర్ వద్ద అవతలి వైపుకి అంబులెన్స్ టర్నింగ్ తీసుకుంటోంది. ఆ సమయంలో ఒక్కసారిగా హై స్పీడ్ తో వచ్చి ఐ10 కారు దాన్ని ఢీకొట్టింది. దీంతో ఏడుగురు మరణించగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన సమయంలో అంబులెన్స్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అవతలి నుంచి వస్తున్న వాహనాలను చూడకుండా నిర్లక్ష్యంగా టర్న్ తీసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఆ సమయంలో కారు కూడా అతి వేగంతో వస్తోందన్నారు.

Latest Updates