కరోనా పేరుతో మోసం చేసిన అంబులెన్స్ సిబ్బంది అరెస్ట్

కర్నూలు ప్రభుత్వాసుపత్రి పాత గైనిక్ వార్డు వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు

వార్డు బాయ్ సహా మరో ఇద్దరి అరెస్ట్

కర్నూలు: కరోనాతో చనిపోయాడంటూ..  మభ్యపెట్టి తామే అంత్యక్రియలు చేస్తామని డబ్బులు వసూలు చేసిన అంబులెన్స్ సిబ్బందిని కర్నూలు  మూడవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వ్యవహారం మీడియా ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ స్పందించి క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించిన విషయం తెలిసిందే. సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు కూడా చేసుకునే అవకాశం లేకుండా చేసిన ఘటన అత్యంత హేయమైనదని.. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్న ఆదేశాలతో కర్నూలు త్రీటౌన్ పోలీసులు మూడు బృందాలు వేట సాగించాయి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకున్న కర్నూలు మూడవ పట్టణ సీఐ తబ్రేజ్ పరారీలో ఉన్న వారి కోసం టెక్నాలజీని ఉపయోగించి వారిపై బలమైన ఆధారాలు సంపాదించారు. అంబులెన్స్ సిబ్బందిని స్వయంగా విచారించి వారి కదలికలు కనిపెట్టారు. కేసు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న నిందితులు ప్రభుత్వ ఆస్పత్రిలోని పాత గైనిక్ వార్డు దగ్గరకు రాగా మూడవ పట్టణ పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు.

నిందితులను అరెస్టు చేసిన సందర్భంగా కర్నూలు త్రీటౌన్ సీఐ తబ్రేజ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీన కర్నూలు బి.క్యాంప్ రెవెన్యూ కాలనీకి చెందిన సాయినాథరావు గుండెపోటుతో ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయాడన్నారు. ఆస్పత్రిలో స్వీపర్ గా పనిచేస్తున్న తిరుపాలు, వార్డు బాయ్ జగ్గుల వెంకటగిరి, కర్నూలు బుధవారపేటకు చెందిన కాటం జయరాజు కలసి సాయినాథరావు కరోనాతో చనిపోయాడని వారి బంధువులకు చెప్పారు. తామే అంత్యక్రియలు జరిపిస్తామని 91 వేల నగదు డిమాండ్ చేశారని.. 41 వేలు నగదు తీసుకుని.. మరో 50 వేలు ఫోన్ పే ద్వారా తీసుకున్నారని.. నిందితులు తీసుకున్న సొత్తులో రూ.61 వేలు రికవరీ చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 15 రోజుల రిమాండ్ కు ఆదేశించారని సీఐ తబ్రేజ్ తెలిపారు.

Latest Updates