కరోనా ఎఫెక్ట్: తిరుమల శ్రీవారి సర్వ దర్శనం రద్దు.. ఓన్లీ టైమ్ స్లాట్

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాయి. రద్దీగా ప్రాంతాలకు వెళ్లొద్దని సూచిస్తూ షాపింగ్ మాల్స్, థియేటర్లు మూసేయాలని ఆదేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిత్యం వేలాదిగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వైరస్ బారినపడకుండా నియంత్రణ చర్యల్లో భాగంగా టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. రోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్‌మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో సర్వ దర్శనాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణ భూమిపూజను వాయిదా వేసింది. అలాగే కరోనా నివారణను కోరుతూ.. శ్రీశ్రీనివాస శాంతి ఉత్సవ సహిత ధన్వంతరి మహాయాగంను నిర్వహించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. మరోవైపు విశేషపూజ, సహస్త్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం సేవలను ముందుగా బుక్ చేసుకున్న భక్తులకు తేది మార్చుకునే అవకాశం, లేదా బ్రేక్ దర్శనాలకువెళ్లే వెసులుబాటును టీటీడీ కల్పించింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడటం మంచిదికాదని భావించిన టీటీడీ ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది.

మంగళవారం నుంచి ఓన్లీ టైమ్ స్లాట్

కరోనా నియంత్రణకు తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాకు వెల్లడించారు. ‘దేశ, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. వైరస్‌ వ్యాప్తి కాకుండా నిరంతరం చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది ఒకేచోట గుమ్మిగూడకుండా తిరుమలను సెక్టార్లుగా విభజించి, శుభ్రత చర్యలు చేపడుతున్నాం. భక్తులు రూమ్స్ ఖాళీ చేసిన తర్వాత డిసిన్ఫెక్ట్స్‌తో శుభ్రం చేసి మాత్రమే మరొకరికి కేటాయిస్తున్నాం. అనుమానితులను అలిపిరి, నడకదారిలో గుర్తించి వైద్య చికిత్సకోసం తరలించే ఏర్పాటు చేశాం. కరోనా వైరస్ ప్రభావితం వల్లా ఒకే చోట ఆరు గంటలు ఉండటం మంచిది కాదు. ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి భక్తులు రాకుండా లైవ్ ద్వారా వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలలోనూ సర్వ దర్శనం విధానాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. మంగళవారం నుంచి టీటీడీ కేటాయించే సమయంలో మాత్రమే దర్శనానికి రావాలి. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం దీనికి భక్తులు సహకరించాలి’ అని తెలిపారు.

Latest Updates