గ్రౌండ్ లో ఇనుపరాడ్లతో కొట్టారు : భారత మాజీ క్రికెటర్ పై దాడి

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ.. డిస్ట్రిక్ట్ సీనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అమిత్ భండారిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కశ్మీరే గేట్‌ లోని సెయింట్ స్టిఫెన్స్ గ్రౌండ్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది.  గ్రౌండ్‌ లో అండర్-23 టీమ్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. ట్రయల్స్ ముగించుకొని బయటకు వచ్చిన అమిత్ భండారిపై యువకులు ఇనుపరాడ్లు, హాకీ స్టిక్‌ లతో దాడి చేశారు.

తీవ్రంగా గాయాలైన అమిత్ ను వెంటనే స్థానిక హస్పిటల్ కి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తులు పోలీసులు ఘటనస్థలికి చేరుకొనేలోపే అక్కడి నుంచి పారిపోయారు. అండర్-23 టీమ్ లో చోటు దక్కని కొందరు కక్షగట్టి ఈ దాడికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడిలో భండారి తల, కాళ్ల భాగంలో ఏడు కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు డాక్టర్లు.

Latest Updates