‘గోలీమారో’ కామెంట్లు  కొంపముంచాయి

    రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సింది కాదు

    ఢిల్లీలో ఓటమిపై అమిత్ షా

న్యూఢిల్లీ: ‘గోలీమారో’ లాంటి కామెంట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీని దెబ్బ తీశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తమ పార్టీలో కొందరు నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నికలపై ప్రభావం చూపిందని ఒప్పుకున్నారు. గురువారం ఢిల్లీలో టైమ్స్ నౌ సమ్మిట్ 2020లో ఆయన మాట్లాడారు. తమ పార్టీ నేతలు గోలీ మారో, ఇండోపాక్ మ్యాచ్ లాంటి రెచ్చగొట్టే  కామెంట్లు చేయకుండా ఉంటే బాగుండేదన్నారు. ఈ వివాదాస్పద కామెంట్లను పార్టీ అప్పుడే తప్పుబట్టినట్లు చెప్పారు. “మా పార్టీ అంటే ఏమిటో ప్రజలకు తెలుసు. అయితే వాళ్లు ఎందుకు ఓటేయలేదో తెలియదు. ఈ కామెంట్లు కూడా ఒక కారణమై ఉండొచ్చు, మా పార్టీ మెజార్టీ సాధిస్తుందని గట్టిగా నమ్మా. చాలాసార్లు నా అంచనాలు కరెక్ట్ అయ్యాయి. ఈ సారి తప్పాయి” అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలపై పార్టీలో చర్చిస్తామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు కొందరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశ ద్రోహులకు గోలీమారో అంటూ సీఏఏ వ్యతిరేక ఆందోళనకారులను ఉద్దేశించి కేంద్రమంత్రి ఠాకూర్ కామెంట్ చేశారు. యూపీ సీఎం యోగి కూడా ఈ వ్యాఖ్యలను సమర్థించి.. దేశద్రోహులకు బుల్లెట్లతోనే  సమాధానం చెప్పాలన్నారు. షాహీన్ బాగ్ లో ఆందోళనలపై బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ వివాదాస్పద కామెంట్ చేశారు. “షాహీన్ బాగ్ లో లక్షల మంది ఆందోళన చేస్తున్నారు. వాళ్లు మీ ఇళ్లల్లోకి చొరబడి మీ అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను రేప్ చేస్తారు. వారిని చంపేయండి” అని అన్నారు.  బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఇండియా, పాక్‌ మధ్య మ్యాచ్ గా అభివర్ణించారు. బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను టెర్రరిస్టుగా వ్యాఖ్యానించారు.

సీసీఏపై చర్చకు సిద్ధం

సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు. దీనిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమన్నారు. మత ప్రాతిపదికన విభజన రాజకీయాలు చేసే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. సీఏఏపై చర్చించాలనుకునేవారికి మూడు రోజుల్లో సమయం ఇస్తానని చెప్పారు. ఎన్ పీఆర్‌కు ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేదన్నారు.

 

Latest Updates