ఎన్ఆర్సీకి డెడ్ లైన్ 2024

చక్రధర్​పూర్ (జార్ఖండ్): వచ్చే జనరల్​ ఎలక్షన్స్​లోపు దేశవ్యాప్తంగా ఎన్‌‌ఆర్సీ అమలుచేసి, దేశంలోకి అక్రమంగా చొరబడిన ప్రతి ఒక్కరినీ వెనక్కు పంపుతామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా చెప్పారు. అక్రమ చొరబాటుదారులను దేశం నుంచి పంపించేస్తామని తాము అంటుంటే.. వాళ్లను వెళ్లగొడితే ఎక్కడికి వెళతారు, ఏం తింటారని రాహుల్​ బాబా ప్రశ్నిస్తున్నాడని షా విమర్శించారు. ఎవరు అడ్డుకున్నా 2024లోగా ఈ ప్రక్రియను మొత్తం పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు జార్ఖండ్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చక్రధర్​పూర్, బహరాగోరాలో జరిగిన సభలో అమిత్​ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎంత ముఖ్యమో, టెర్రరిజం రూపుమాపడం, నక్సలిజం, రామ మందిర నిర్మాణం వంటి జాతీయ అంశాలు కూడా అంతే ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జాతీయ అంశాల ప్రస్తావన ఎందుకన్న కాంగ్రెస్​ నేతల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అయోధ్య కేసులో విచారణే అక్కర్లేదని కాంగ్రెస్​ నేతలు కోర్టుకు చెప్పారు.. కానీ ప్రజలిచ్చిన ధైర్యంతో బాబ్రీ కేసు విచారించాల్సిందేనని తమ సర్కారు కోర్టును కోరిందన్నారు. దీంతో అయోధ్యలో రాముడి గుడి మాత్రమే కట్టాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. ఎన్‌‌ఆర్సీ అమలు చేయడంవల్లే పశ్చిమ బెంగాల్​లో జరిగిన బైపోల్స్​లో బీజేపీ నష్టపోయిందన్న కామెంట్స్​ను ఆయన కొట్టిపారేశారు. జార్ఖండ్‌లో బీజేపీని ఓడించేందుకు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి కట్టిందని అమిత్​ షా విమర్శించారు. ఇంతకు ముందు కాంగ్రెస్​ ప్రభుత్వం స్టూడెంట్లపై కాల్పులు జరిపించింది.. ఇప్పుడు అదే కాంగ్రెస్​తో జేఎంఎం లీడర్​ హేమంత్​ సోరన్  చేతులు కలిపారని మండిపడ్డారు. రాష్ట్రంలో రఘువర్​ దాస్​ ఐదేళ్ల పాటు అవినీతిరహిత పాలన అందించారని మెచ్చుకున్నారు. ‘55 ఏళ్ల కాంగ్రెస్​ పాలనలో రాష్ట్రానికి ఏంచేశారో రాహుల్​ చెప్పాలి.. 5 ఏళ్లలో ఏంచేశామో మేము చెప్తాం’ అని అమిత్ షా సవాల్​ విసిరారు.

Latest Updates