నెగ్గిన ప్రతిపక్షాల పంతం: విద్యార్థులపై లాఠీచార్జ్‎పై సభలో అమిత్ షా ప్రకటన

నెగ్గిన ప్రతిపక్షాల పంతం: విద్యార్థులపై లాఠీచార్జ్‎పై సభలో అమిత్ షా ప్రకటన

న్యూఢిల్లీ: ప్రతిపక్ష ఇండీ కూటమి పంతం నెగ్గింది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‎పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‎లో మాట్లాడుతారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సోమవారం (ఆగస్ట్ 10) లోక్ సభలో అధికారిక ప్రకటన చేశారు. 

విద్యార్థుల సమస్యలు, జూలై 20 నాటి చలో పార్లమెంట్ సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీచార్జ్, బలప్రయోగం వంటి అంశాలపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దీనిపై హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని పేర్కొన్నారు. అయితే, చర్చ సమయంలో ప్రతిపక్షాలు ఎటువంటి గందరగోళం సృష్టించకుండా, హోం మంత్రి ఇచ్చే సమాధానాన్ని ప్రశాంతంగా వినాలని కోరారు. పార్లమెంటు కార్యకలాపాలు సాఫీగా సాగేందుకు సహకరించాలని సూచించారు. 

నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‎తో జులై 20న సీజేపీ చలో పార్లమెంట్‎కు పిలుపునిచ్చింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యార్థులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. 

విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే విద్యార్థులపై పోలీసుల చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్‎లో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఇందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో పార్లమెంట్‎ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. దీంతో దాదాపు మూడు వారాలుగా పార్లమెంట్ లో గందరగోళం నెలకొంది.

ALSO READ : గోల్డ్, సిల్వర్‌పై టాక్స్ పెంపుతో మోడీ సర్కార్ 3 నెలల్లో ఎంత సంపాదించిందంటే..?

పార్లమెంట్ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టడంతో మూడు వారాలుగా ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్‎లో ప్రతిష్టంభనకు తెరదించేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‎లో అమిత్ షా మాట్లాడుతారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మూడు వారాలుగా పార్లమెంట్‎లో నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. అయితే, ప్రతిపక్షాల డిమాండ్ కు మోడీ సర్కార్ తలొగ్గడం ఢిల్లీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.