
సీఏఏకు అనుకూలంగా వచ్చే నెల 15న హైదరాబాద్ లో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని లక్ష్మణ్ చెప్పారు. దీనికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వస్తారన్నారు. జనసేన తమ మిత్రపక్షమని, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా సభకు ఆహ్వానిస్తామని లక్ష్మణ్ చెప్పారు. ఈ నెల 25 కల్లా రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనుందని, జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల నియామకం కూడా ఈలోపే పూర్తికానుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం చిన్న చూపు చూస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన కామెంట్లు ఆయన్నే ఇరుకున పడేశాయన్నారు. తలసాని ఆరోపణలపై అక్కడే ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులను లెక్కలతో సహా వివరించారని, దీంతో తలసాని మాటలు రాక మౌనంగా ఉండిపోయారని లక్ష్మణ్ చెప్పారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కేంద్రం విడుదల చేసిన నిధులపై లెక్కలు చేప్పడంతో టీఆర్ఎస్ నేతలకు జవాబిచ్చే పరిస్థితి లేకపోయిందన్నారు. మరోవైపు కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో నార్సింగ్ సొసైటీ నుంచి వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన దళిత కార్యకర్త సత్యనారాయణను గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాలువా కప్పి లక్ష్మణ్ సన్మానించారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న సత్యనారాయణను సొంతూరు రైతులు నిజాయితీగా ఎన్నుకోవడం పార్టీకి గర్వకారణమన్నారు.