అన్నదాతల అప్పులు తీర్చిన బిగ్ బీ

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన మంచి పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. పోయిన సంవత్సరం ఉత్తరప్రదేశ్‌కు చెందిన వెయ్యి మంది రైతుల రుణాలను చెల్లించిన అమితాబ్‌..బుధవారం మరో రెండు వేల మందికి పైగా రైతుల అప్పులను తీర్చేశారు. ఈ రైతులంతా బిహార్‌కు చెందినవారు. బిహార్‌కు చెందిన మొత్తం రుణగ్రహీత రైతుల్లో తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్న 2100 మంది రైతులను సెలక్ట్ చేసుకుని వారి రుణాలను అమితాబ్‌ బ్యాంకులకు వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేశారు. కూతురు స్వేతా బచ్చన్‌, కొడుకు అబిషేక్‌ బచ్చన్‌ చేతుల మీదుగా బాధిత రైతులకు అమితాబ్‌ సాయం చేశారు. ఈ మేరకు ఇచ్చిన హామీని అమితాబ్‌ అమలు పరిచారు.

ఈ సందర్భంగా తన బ్లాగ్‌లో ఇలా రాసుకున్నారు అమితాబ్. మరో వాగ్దానం నెరవేర్చాల్సి ఉంది. దేశం కోసం పుల్వామా దాడిలో మృతిచెందిన అమరవీరుల కుటుంబ సభ్యులను, వారి భార్యలను ఆదుకోవాల్సి ఉందన్నారు. ఈ సాయం కూడా త్వరలోనే తీరుస్తామని తెలిపారు బిగ్ బీ. అమితాబ్ ఫ్యామిలీ చేసిన సాయానికి బాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియాలో మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. రియల్ హీరో, పేరుకు తగ్గట్టుగానే పెద్ద మనసున్నోడు అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. మిగతా హీరోలు కూడా అమితాబ్ ను ఆదర్శంగా తీసుకుని సాయం చేయాలని మరికొందరు సూచిస్తున్నారు.

Latest Updates