నేడు ఎన్డీయే పక్షాలకు అమిత్​షా విందు

న్యూఢిల్లీ: ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలకు బీజేపీ చీఫ్‌‌‌‌ అమిత్‌‌‌‌ షా మంగళవారం రాత్రి విందు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయా పక్షాల నేతలతో సమావేశమై చర్చించనున్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీయే 300 వరకు సీట్లు సాధిస్తుందని, మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమిత్​షా మంగళవారం రాత్రి ఢిల్లీలోని అశోకా హోటల్​లో డిన్నర్​ మీటింగ్​ ఏర్పాటు చేశారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్​ సీఎం నితీశ్​కుమార్, శివసేన చీఫ్​ ఉద్ధవ్​ థాక్రే, లోక్​జనశక్తి పార్టీ అధినేత రాం విలాస్​ పాశ్వాన్​ తదితరులు ఇందులో పాల్గొననున్నారు. ప్రధాని మోడీ కూడా ఈ భేటీకి వచ్చే అవకాశముందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ చీఫ్​ మినిస్టర్​పన్నీర్​ సెల్వం కూడా ఎన్డీయే భేటీలో పాల్గొంటారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్​ తమిలిసై సౌందరరాజన్​ ప్రకటించారు. లోక్​సభ ఎన్నికల్లో కలిసి పనిచేసిన భాగస్వామ్య పక్షాలకు ‘థ్యాంక్స్’చెప్పేందుకే అమిత్​షా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎలక్షన్​ రిజల్ట్ ఆధారంగా ఎన్డీయే పక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించే
అవకాశం ఉంది.

తొలుత పార్టీ భేటీ..

ఎన్డీయే పక్షాల భేటీకి ముందు ఢిల్లీలోని బీజేపీ హెడ్​ క్వార్టర్స్​లో ఆ పార్టీ కీలక నేతలు, కేంద్ర మంత్రుల సమావేశం జరుగనుంది. ప్రధాని మోడీ, అమిత్​షా సహా పార్టీ సీనియర్లు చాలా మంది ఈ భేటీకి హాజరుకానున్నారు.

 

Latest Updates