దళపతి టు మినిస్టర్‌

amith-shah-political-entry-life-histry

పార్టీలో అంచలంచెలుగా
ఎదిగిన వ్యూహకర్త

 1995లో తొలిసారి 
ఎమ్మెల్యేగా ఎన్నిక

 14 ఏళ్లుగా మోడీకి కుడి భుజం

అమిత్‌ షా.. కేంద్రంలో సొంత మెజారిటీతో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రాటజిస్ట్‌! కిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ దేశంలో కమల వికాసానికి పునాదులు వేసిన ఆయన 14వ ఏటనే ఆర్‌ఎస్‌ఎస్‌లో ‘తరుణ్‌ స్వయంసేవక్‌’గా చేరారు. కాలేజీ చదివే రోజుల్లో(1982లో) అహ్మదాబాద్‌లో ఏబీవీపీ సెక్రటరీగా పనిచేశారు. తర్వాత అహ్మదాబాద్‌ బీజేపీ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. అప్పట్నుంచి గుజరాత్‌ రాజకీయాల్లోకి చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చారు. 1997లో బీజేపీ యువమోర్చాకు జాతీయ ట్రెజరర్‌గా నియమితులయ్యారు. తర్వాత గుజరాత్‌ బీజేపీ శాఖకు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1995లో సర్ఖేజ్‌ అసెంబ్లీ సీటు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో అదే సీటు నుంచి లక్ష ఓట్ల మెజారిటీతో మళ్లీ నెగ్గారు. 2002, 2007లో అంతకంటే భారీ మెజారిటీతో సర్ఖేజ్‌ నుంచి గెలిచారు. 2012లో వరుసగా ఐదోసారి నారన్‌పురా సెగ్మెంట్‌ నుంచి విజయం సాధించారు. 1995లో కేశుభాయ్‌ పటేల్‌ గుజరాత్‌ సీఎంగా ఉన్న టైంలో షా.. గుజరాత్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌(జీఎస్‌ఎఫ్‌సీ) చైర్మన్‌గా పనిచేశారు.

2002లో మోడీ కేబినెట్‌లో తొలిసారి సహాయ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. తర్వాత కీలక శాఖలకు మినిస్టర్‌గా పనిచేశారు. 2001–-14 మధ్య మోడీకి కుడిభుజంగా ఉన్నారు. సోహ్రబుద్దీన్‌ నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో విమర్శలు వెల్లువెత్తడంతో గుజరాత్‌ హోంమంత్రి పదవికి 2010లో రాజీనామా చేశారు. తర్వాత యూపీ బీజేపీకి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించారు. 80 లోక్‌సభ సీట్లలో బీజేపీ ఏకంగా 73 సీట్లు గెల్చుకుంది. మోడీ ప్రధాని అయ్యాక బీజేపీ చీఫ్‌గా షా పగ్గాలు చేపట్టి అనేక రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారు. ఆయన వల్లే మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. తర్వాత ఢిల్లీ, బీహార్లో మాత్రం పార్టీ ఓటమి పాలైంది. 2017లో యూపీ, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చత్తీస్‌గఢ్‌, రాజస్తాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో బీజేపీ ఓటమి పాలైంది. తాజా ఎన్నికల్లో మోడీ–షా నేతృత్వంలోనే 303 సీట్లు నెగ్గి బీజేపీ అఖండ విజయం సాధించింది.

Latest Updates